ఉరిశిక్షపై స్టే ఇవ్వలేం :ఢిల్లీ హైకోర్టు

నిర్భయ కేసులో మరణ శిక్ష అమలు సమయం దగ్గరపడుతున్న కొద్ది, శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు శతావిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్‌పై స్టే కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా… హైకోర్టు తోసిపుచ్చింది. తనపై ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ను నిలిపివేయాలని నిర్భయ కేసు దోషి ముఖేష్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. ఒక కోర్టులో ఆర్డర్ ఇస్తే మరో కోర్టుకు వచ్చి అడగడం మంచిది కాదని… తప్పనిసరి అయితేనే కింది కోర్టును ఆశ్రయించాలని అదేశించింది. కేసులో దోషుల క్షమాభిక్ష పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్కో దోషికి ఒక్కో రకం నిబంధనలు ఉండవని స్పష్టం చేసింది. 2017 నుంచి క్షమాభిక్ష పిటిషన్లు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించింది. తీర్పు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది. 14 రోజుల గడువు అనేది.. కేసు తీర్పు వచ్చినప్పటి నుంచి ఉంటుందని వ్యాఖ్యానించింది. నలుగురు దోషులకు ఈ నెల 24న ఉరిశిక్ష అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. కాగా… నలుగురిలో ఒక దోషి ముఖేష్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయగా… మంగళవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే.