సైబర్ నేరాల అదుపు కోసం సైబర్‌ ల్యాబ్స్…

సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లతోపాటు.. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సుమారు రూ. 70 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో అడిషనల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో 165 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరికీ సైబర్‌టూల్స్‌ వాడకం, సైబర్‌ నేరాల పరిశోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, మెళకువలు, అత్యాధునిక పద్ధతులపై నిరంత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలోని లెర్నింగ్‌ సెంటర్‌లో విదేశీ నిపుణులు, రాష్ట్ర పోలీస్‌ విభాగంలోని సైబర్‌ నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల పరిశోధన మరింత వేగవంతం కానుంది.

అటు ఆయా జిల్లాల్లో సుశిక్షితులైన సైబర్‌ క్రైం సిబ్బంది.. కేసులను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. నకిలీ ఈ-మెయిల్స్‌, ఫోన్‌కాల్స్తో బ్యాంకు ఉద్యోగులమని, లాటరీలు వచ్చాయని ఆశపెడుతూ లక్షలు కొల్లగొడుతున్న కేసులపై సైబర్‌ విభాగాలు దృష్టి పెడుతున్నాయి. యువతులు, మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పంపి, మానసికంగా వేధిస్తున్న పోకిరీలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు. ఎంతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 2018లో 1,205 కేసులు నమోదు కాగా.. వాటిలో 532 కేసులను సైబర్‌ క్రైం పోలీసులు చేధించారు. 2019లో నవంబర్‌ వరకు 2,240 కేసులు నమోదుయ్యాయి. వాటిలో 568 కేసులను పరిష్కరించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధి మినహాయించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గతేడాది 411 కేసులు నమోదయ్యాయి.