వేగంగా విజృంభిస్తున్న `రాకాసి కరోనా` వైరస్‌…

చైనాలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుంది. పాముల నుంచి వచ్చినట్టు వైద్య నిపుణులు చేప్తున్న ఈ రాకాసి వైరస్‌… ప్రజల ప్రాణాలను కబళిస్తోంది. చైనాతో పాటు ప్రపంచదేశాలకు కనుచూపు వేగంతో విస్తరిస్తోంది. చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ భయంకర వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 80 మంది మరణించారు. మరో 2,744 మందిలో వైరస్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 3,806 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 24 మంది మరణించడం… 461 కొత్త కేసులు నమోదవడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రతి రోజు దాదాపు 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి 54 మంది తిరిగి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, దీనిపై చైనా అధ్యక్షుడు నిన్ననే సుదీర్ఘ సమీక్ష నిర్వహించి… వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జలుబు, దగ్గుతో మొదలవుతున్న ఈ వ్యాధి ముదురుతూ.. నిమోనియాగా మారి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తోంది. చైనాతో పాటు జపాన్‌, తైవాన్‌, నేపాల్‌, హాంగ్‌కాంగ్‌, వియత్నాం, మలేషియా, సింగపూర్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు కూడా కరోనా వైరస్‌ వ్యాపించింది. అటు.. వైరస్‌ను కట్టడి చేయడానికి చైనా వైద్యులు వ్యాక్సిన్‌ తయారీలో బిజీగా ఉన్నారు. భారత్‌లో ఈ వైరస్‌ ప్రవేశించనప్పటికీ.. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేక థెర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు జరుపుతున్నారు. వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆసుపత్రికి తరలించి అన్నిరకాల పరీక్షలు చేపడుతున్నారు. అవసరమైతే కొంతకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.