అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచాలి -సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరంతో పాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలని సీఎం కోరారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పట్టణాల్లో పెరుగుతున్న కాలుష్యంపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు.

‘‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. నగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతున్నది. మనది సముద్ర తీరం లేని నగరం. కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే ఇతర నగరాల మాదిరిగా జనజీవనం నరకప్రాయం అవుతుంది. దీనికి విరుగుడుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. హైదరాబాద్ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. వీటిలో విరివిగా చెట్లు పెంచాలి. దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలి. దీనివల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, కాలుష్యం పెరగకుండా చూడవచ్చు. నగరంలో కూడా విరివిగా చెట్లు పెంచాలి. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలి. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

 

నెల రోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు…

హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను 350 వరకు పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు వీటితో ఎంతో సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలని చెప్పారు. నగరంలోని 150 డివిజన్లలో ప్రతీ డివిజన్‌లో రెండు బస్తీ దవాఖానాలుండాలని… ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో మరిన్ని ఎక్కువ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే నెల రోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.