మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఫిబ్రవరి 5 నుంచి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు జాతర పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షంచడంతో భాగంగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు మేడారం వెళ్లిరావడానికి… ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

కాగా… ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఇతర ప్రజా ప్రతినిధులు… మేడారం జాతరకు ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం మంత్రులు, సీఎస్‌ సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సీఎం సమీక్షించారు. ‘‘మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మంచినీరు, పారిశుధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు మంచిది కాదు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలి. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను అక్కడికి పంపాలి. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.