బీడీఎల్‌లో 15% వాటా విక్రయానికి నిర్ణయం…

భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ లో 15 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించనున్నట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్, అత్యాధునిక గైడెడ్‌ ఆయుధ వ్యవస్థలను తయారుచేయగల అతికొద్ది భారతీయ సంస్థలలో ఒకటి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ డైనమిక్స్‌ లో కేంద్ర ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. దీని కొనుగోలుకు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానం ద్వారా బిడ్లు వేయాల్సిందిగా ప్రభుత్వం వాణిజ్య బ్యాంకర్లను కోరింది. ఇదే కాకుండా నేషనల్‌ అల్యుమినియం కంపెనీ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎన్‌ఎండీసీ, ఎన్‌బీసీసీ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ లాంటి సంస్థలలో కూడా పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం యోచిస్తోంది.