ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో జన చైతన్యం వెల్లువెత్తింది. 120 మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 2వేల 647 వార్డులతోపాటు 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. ఒక వార్డు ఏకగ్రీవమైంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. జిల్లాల్లోని మున్సిపాలిటీలతో పోలిస్తే.. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ శాతం కొంత మేర తక్కువగా నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో బుధవారం ఉదయం నుంచే హడావుడి మొదలైంది. ఉదయం ఆరు గంటలకు ఎన్నికల అధికారులు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మొదట కొంత మందకొడిగా సాగినప్పటికీ.. 9 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం మూడు వరకే చాలా వరకు పోలింగ్‌ పూర్తయింది.  ఐనప్పటికీ ఐదు గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రవేశించినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. కొత్తఓటర్లతో పాటు వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు పూర్తిస్థాయిలో పడినట్లు తేలింది. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఓటు చైతన్యం పెరిగింది.

మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,099 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బ్యాలెట్‌ బాక్సులను గట్టి భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్దేశిత స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఈ నెల 25 శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కాగా శుక్రవారం ఎన్నికలు జరుగనున్న కరీంనగర్‌ కార్పొరేషన్‌కు బుధవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. ఇక్కడున్న 60 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 58 వార్డులకు ఈ నెల 24న పోలింగ్‌ జరుగుతుంది. ఈ కార్పొరేషన్‌ కౌంటింగ్‌ ఈ నెల 27న నిర్వహిస్తారు.

మున్సిపల్‌ పోలింగ్‌ సరళిని ఎన్నికల సంఘం అధికారులు జిల్లా కేంద్రాల నుంచి వెబ్‌ కాస్టిం గ్‌ ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు పోలింగ్‌ సరళిని పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వృద్ధుడిని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు స్వయంగా వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లి ఓటు వేయించారు. ఉదయం ముందుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు సిబ్బంది ఆహ్వానించారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో ఉదయం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు పోలింగ్‌ సిబ్బంది బొట్టుపెట్టి స్వాగతం పలికారు.

బుధవారం అన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినప్పటికీ, కామారెడ్డిలోని 41వ వార్డు 101వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదైంది. ఒక్క టెండర్‌ ఓటు పడినా రీ పోలింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఈ నెల 24న రీపోలింగ్‌ జరిగే అవకాశం ఉన్నది. దీనిపై రాష్ట్ర ఎన్నికలసంఘం పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. బోధన్‌ మున్సిపాలిటీలో సైతం ఒక వార్డులో ఇదేరకమైన పరిస్థితి నెలకొనడంతో అక్కడ రీపోలింగ్‌పై ఎస్‌ఈసీ పరిశీలన చేస్తున్నది. అటు పోలింగ్‌ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలాంటి సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలచేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పోలింగ్‌ 24న ఉన్నందున దానిపై ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం పడుతుందని.. సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ను విడుదల చేయరాదని ప్రకటన చేసింది.