ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం

ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేడుకలను పురస్కరించుకుని..ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం తరఫున శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, సమ్మక్క, సారలమ్మలతో పాటు.. కాకతీయ వైభవం, చరిత్రను ఘనంగా చాటేలా  థీమ్‌ను రూపొందించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ సలహా మేరకు.. ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని శకటాన్ని రూపొందించారు. ఐదేండ్ల తర్వాత ఈసారి పరేడ్‌కు మన శకటం ఎంపిక కావడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సంస్కృతి, వైభవం అవిష్కృతం కాబోతున్నది.  స్వరాష్ట్రం సిద్దించాక 2015 లో తొలిసారి తెలంగాణ తరఫున శకటం ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. ఐదేండ్ల తర్వాత మరోసారి శకటం ప్రదర్శించబడుతున్నది. 9 రోజుల పాటు ఘనంగా సాగే బతుకమ్మ పండుగతో పాటు.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మ వైభవం చాటేలా శకటాన్ని తయారు చేశారు. దీంతో పాటు కాకతీయ చరిత్రను ప్రతిబింబించేలా వెయ్యి స్థంభాల గుడిని సైతం అందంగా రూపొందించారు.

మరోవైపు ఢిల్లీ వేదికగా.. తెలంగాణ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను  చాటి చెప్పేలా.. గొండి, తోటి, ప్రదాన్‌, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.