కొత్త మున్సిపల్ చట్టంతో ఇంటి అనుమతులు సులభతరం

ఇండ్ల నిర్మాణానికి అనుమతులు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలిగించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. సులభంగా అనుమతులు మంజూరుచేయడం, నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ చట్టం ప్రత్యేకత. ఇండ్ల నిర్మాణానికి ఆన్‌ లైన్‌ లో నిర్ణీత గడువులోగా అనుమతినివ్వని అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం.. 75 గజాల్లోపు స్థలం-63 చదరపు మీటర్లు జీ+1 ఇంటి నిర్మాణానికి స్థానిక సంస్థ నుంచి అనుమతిని తీసుకోనక్కర్లేదు. ఆన్‌ లైన్‌లో వివరాలను నమోదుచేసుకుని కేవలం ఒక్క రూపాయి చెల్లించడం ద్వారా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక కూడా కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం పొందాల్సిన అవసరంలేదు.

64 చదరపు మీటర్ల నుంచి 500 చ.మీ.లోపు విస్తీర్ణంలో పదిమీటర్ల ఎత్తులో ఇల్లు కట్టుకోవాలనుకునే వారు.. ప్రత్యేకంగా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. ఇందుకోసం ఆన్‌ లైన్‌లో స్వీయధృవీకరణపత్రాన్ని అందజేసి తక్షణమే అనుమతి తీసుకునే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. 200 చ.మీలోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టేవారు పదిశాతం బిల్డప్ ఏరియాను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. తప్పుడు వివరాలను పొందుపర్చి అనుమతి తీసుకుంటే మాత్రం నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తారు. 500 చదరపు మీటర్లు లేదా ఆపై విస్తీర్ణంలో.. పదిమీటర్ల కంటే అధిక ఎత్తులో నిర్మించే భవనానికి ఆన్‌ లైన్‌లో కేవలం 21 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తారు. భవన నిర్మాణ సమయంలో 10 శాతం బిల్టప్ ఏరియాను స్థానిక కార్పొరేషన్ లేదా మున్సిపాల్టీకి తనఖాపెట్టాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ను సమర్పిస్తేనే ఆ తనఖాను నిర్మాణదారుడికి వెనక్కు ఇస్తారు.

ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడితే సంబంధిత మున్సిపల్ అధికారికి లేదా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేయవచ్చు. ఫిర్యాదుదారుడి పేరును గోప్యంగా ఉంచి అధికారులు వారంలోగా తగినచర్యలు తీసుకుంటారు. అక్రమ నిర్మాణం గురించి ఇచ్చిన సమాచారం నిజమని తేలితే సదరు ఫిర్యాదుదారుడికి ప్రోత్సాహక బహుమతి కూడా ఇస్తారు. 200 నుంచి 500 చ.మీ.లోపు విస్తీర్ణంలో కట్టిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరుకావాలంటే.. నిబంధనల ప్రకారమే ఆ నిర్మాణం జరిగినట్టు స్థల యజమాని స్వీయ ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమించినవారికి మూడేండ్ల జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తారు.
కొత్తగా లేఅవుట్లు, వెంచర్లను అభివృద్ధి చేసేవారు ప్రాథమిక అనుమతి కోసం ఆన్‌ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి లభించిన తర్వాత రెండేండ్లలోగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణపత్రాలతో ప్రాథమిక అనుమతి తీసుకున్నట్లు రుజువైతే తక్షణమే రద్దు చేస్తారు. అనుమతి తీసుకోకుండా లేఅవుట్లను అభివృద్ధి చేసేవారికి మూడేండ్ల జైలు శిక్షను విధిస్తారు. స్థలం విలువలో 25 శాతం సొమ్మును జరిమానాగా వసూలు చేస్తారు. మరోవైపు పట్టణాల పరిసరాల పరిశుభ్రతకు కూడా కొత్త మున్సిపల్ చట్టం పెద్దపీట వేసింది. దీని ప్రకారం గోడలపై అనధికారికంగా నోటీసులు, పోస్టర్లు అంటించడానికి వీల్లేదు. కాలుష్యకారక వస్తువుల్ని రోడ్డుపై పడేసేవారు ఈ చట్టంలోని సెక్షన్ 161 కింద శిక్షకు గురవుతారు. శబ్ద, గాలి, నీటి కాలుష్యానికి కారణమయ్యే వారిపై సెక్షన్ 162 కింద చర్యలు చేపడుతారు.

హరితహారం కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలనే నిబంధనను మున్సిపల్ చట్టంలో పొందుపర్చారు. దీని కోసం ప్రతి మున్సిపాలిటీ ప్రత్యేకంగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. కొత్త పాలకమండలులు కొలువుదీరగానే ప్లాన్‌ను సిద్ధంచేసి ఐదేండ్లపాటు హరితహారాన్ని నిర్వహించాలి. ఇందుకోసం విధిగా నర్సరీలను ఏర్పాటుచేయాలి. వీటిని సంరక్షించే బాధ్యత మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లదేనని చట్టంలో పేర్కొన్నరు