కీలక ఘట్టానికి చేరుకున్న పురపోరు

పురుపోరు కీలకఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, అభ్యర్థుల ఖరారు పూర్తి అయ్యింది. దీంతో ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 20న ప్రచారాన్ని ముగించాల్సి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నరు. మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2,727వార్డులు, 9కార్పొరేషన్లలోని 325 వార్డుల్లో ఈ నెల 22న ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 12,398మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలోదాదాపుగా 2,970మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

పురపాలక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. పది కార్పొరేషన్లలో 385 వార్డుల్లో 1,786 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లో అత్యధికంగా 411, కరీంనగర్ లో 348, రామగుండంలో 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తక్కువగా బండ్ల గూడ జాగీర్ లో 85 కేంద్రాలున్నాయి. 120 మున్సిపాలిటీల్లో 2,727వార్డులకు గాను 6,325 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహబూబాబాద్ లో 240, ఆదిలాబాద్ లో 183, నల్లగొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్, వర్దన్న పేట, కొత్తపల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో 15 చొప్పున పోలింగ్ కేంద్రాలున్నాయి.

పురపోరుకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్  ను ఎన్నికల సంఘం నిర్ణయించింది.  ఒక్కో బ్యాలెట్ పత్రంలో మొత్తం నోటాతో కలిపి ఎనిమిది గుర్తులు కేటాయించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి పదిశాతం అదనంగా బ్యాలెట్ పత్రాలను రిజర్వులో ఉంచేందుకు వీలుగా పంపించాలని.. వీటిని రిటర్నింగ్ అధికారుల సమక్షంలో భద్రపరచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.