ఆఫీసుల్లోకి కొత్త బాసులు వచ్చేస్తున్నారు..!

ఆటోమేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ … ఈ మాటలు వింటే చాలు సగటు ఉద్యోగి గుండెల్లో రైళ్లు పరుగెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మనుషులతో పనే లేకుండా.. యంత్రాల సహాయంతోనే పనులన్నీ పూర్తి చేయడంపై ఫోకస్‌ చేస్తున్నాయి కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలన్నింటిలోనూ ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. మనుషుల్లా ఆలోచించి.. ఉద్యోగుల కన్నా వేగంగా, చురుకుగా పనిచేసే యంత్రాలను సృష్టించే ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో కోట్లాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

రోబో… మనిషి మేధస్సుకు ప్రతిరూపం. మానవుడి ఉపాధిని ఈ మర మనిషి ఆక్రమించుకునే రోజులు వచ్చేశాయి. రోబోలతో 2030 కల్లా అనేక రంగాల్లో కోట్ల కొలువులు గల్లంతవుతాయని గార్ట్నర్ నివేదిక వెల్లడించింది. సాఫ్ట్‌ వేర్‌ రంగంలో మ్యాన్‌ మెషీన్‌ టీమింగ్‌ మేనేజర్లను ప్రవేశపెట్టనున్నాయి కంపెనీలు. ఇదే జరిగితే టీమ్‌ లీడర్లు, టీమ్‌ మేనేజర్లు రోడ్డున పడక తప్పదు. ఒకవేళ ఉద్యోగం ఉన్నా..రోబోలకు రిపోర్ట్‌ చేయాలంటే డిజిటల్‌ టెక్నాలజీ వెంట పరుగులు తీయక తప్పదు. ఒక్క ఐటీ రంగంలోనే కాదు నోస్టాలజిస్టు, గార్బేజ్‌ డిజైనర్స్‌, సోలార్‌ టెక్నాలజీ స్పెషలిస్టు, ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ థెరపిస్టులు, టెలీ సర్జన్‌ ..ఇలా ఎన్నో రకాల సేవలను అందించేందుకు రోబోలను ప్రవేశపెడతున్నాయి కంపెనీలు.

కంపెనీలు ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడడంతో స్మార్ట్ యంత్రాలు సహోద్యోగులుగా మారుతున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్‌, బీమా, పెట్టుబడి రంగాల్లో చాలా కంపెనీలు వర్చువల్ అసిస్టెంట్లతో కొలవులను భర్తీ చేస్తున్నాయి. భవిష్యత్‌ లో ఉద్యోగులు వర్చువల్‌ బాసులకే రిపోర్ట్‌ చేయాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. డేటాను సేకరించడం దగ్గర నుంచి మొదలు పెడితే.. ఉద్యోగుల విధులను పర్యవేక్షించే బాసు వరకు ఇండస్ర్టీలు రోబోలకే ప్రాధాన్యం ఇస్తున్నాయంటున్నారు.

400 మిలియన్ల మంది కార్మికుల ఉద్యోగాలను భర్తీ చేయనున్న రోబోలు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ శాతాన్ని పెంచనున్నాయి. ఇప్పటికే 50 కోట్లమంది ఉద్యోగాలు లేక ఏడుస్తుంటే.. మరో పదేళ్లలో వీరి సంఖ్య నాలుగింతలు పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే జరిగితే ..పరిశ్రమలన్నీ రోబోలతోనూ, యంత్రాలతోనే నిండిపోతాయని, మనుషులే కనిపించకుండా పోయే ‍ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.