అట్టహాసంగా కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా జరుగుతోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌ జరగనుంది. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌కు విశేష స్పందన లభిస్తోంది. నగర వాసులతో పాటు.. అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్స్‌ ఇక్కడ పతంగులు ఎగుర వేస్తున్నారు. అంతేకాకుండా 25 రాష్ట్రాలకు చెందిన స్వీట్స్‌ కూడా నగర వాసులను అలరిస్తున్నాయి.

 అటు స్వరాష్ట్రం సిద్ధించాక మన సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా 2016లో మొదలైన కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌ ప్రతియేడు దిగ్విజయంగా జరుగుతోంది. ఐదేళ్లుగా కొనసాగుతున్న కైట్‌ ఫెస్టివల్‌, మూడేళ్లుగా కొనసాగుతున్న స్వీట్‌ ఫెస్టివల్‌ దేశ, విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పండగ అంటే మాములుగా అయితే పట్టణాన్ని వీడి పల్లెకు  వెళ్లడం ఆనవాయితీ. అయితే ఇందుకు భిన్నంగా ఈ ఫెస్టివల్‌ను తిలకించడానికి జిల్లాల నుంచి కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతున్నారు. పలు సంప్రదాయక ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి.

ఇక స్వీట్‌ ఫెస్టివల్‌లో భాగంగా.. అన్ని రాష్ట్రాల సంప్రదాయక మిఠాయిలు పర్యాటకులను నోరూరిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇలాంటి ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఇంటర్నేషనల్‌ స్వీట్స్‌ ఫెస్టివల్ నిర్వహకులు, అమ్మకం దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ ఏడాది కూడా హైదరాబాద్‌కు వచ్చి కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొని ఔత్సాహికులు ఎంజాయ్‌ చేస్తున్నారు…