చేజారిన విజయం

టార్గెట్ ఛేజింగ్‌లో దుమ్మురేపే టీమ్‌ఇండియా.. మొదట బ్యాటింగ్ చేస్తూ మరోసారి తడబడింది. హైదరాబాద్‌లో రికార్డు స్కోరును ఛేదించిన విరాట్ కోహ్లీ సేన.. రెండో టీ20లో ఓటమిని మూటకట్టుకుంది.  భారత్ పై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ లో శివం దూబే ఆటే హైలైట్. యువరాజ్ సింగ్ ను గుర్తుచేసేలా శివమ్ దూబే సిక్సర్లతో చెలరేగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్   30 బంతుల్లో 54 పరుగులతో అలరించాడు. పోలార్డ్ వేసిన 9 వ ఓవర్ లో మూడు సిక్సర్లు బాదాడు. అటు యంగ్ తరంగ్ రిషబ్ పంత్ 22 బంతుల్లో 33 రన్స్‌ చేసి ఫర్వాలేదనిపించాడు. మిగితా బ్యాట్స్ మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. రాహుల్ 11, రోహిత్ 15, కోహ్లీ 19 పరుగులకే వెనుదిరిగారు. విండీస్ బౌలర్లలో కెస్రిక్, హెడెన్ వాల్ష్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్..2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 9 బంతులుండగానే విజయం సాధించింది. ఓపెనర్‌ లెండిల్‌ సిమన్స్‌ 67 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ తో జట్టును గెలిపించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్‌.. కుదురుకున్నాక రెచ్చిపోయాడు. మరో ఓపెనర్‌ లూయిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశాడు. ఆ తర్వాత హెట్‌మయర్‌ 23 రన్స్‌ తో అతడికి సహకారమందించాడు. రెండో వికెట్‌ పడ్డాక సిమన్స్‌ తో కలిసి పూరన్‌  మెరుపులు మెరిపించడంతో భారత్‌కు అవకాశమే లేకుండా పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, జడేజా చెరో వికెట్ తీశారు.

రెండో టీ20లో భారత్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యమే ప్రధాన కారణం.   67 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న సిమన్స్‌ కేవలం 5 పరుగుల వద్దే వెనుదిరగాల్సింది. భువనేశ్వర్‌ వేసిన అయిదో ఓవర్లో అతడి క్యాచ్‌ను మిడాఫ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిమన్స్‌.. చివరి దాకా క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. సుందర్‌ తొలి టీ20లోనూ ఓ తేలికైన క్యాచ్‌ వదిలేశాడు. సిమన్స్‌ క్యాచ్‌ను సుందర్‌ వదిలేశాక.. ఇంకో రెండు బంతులకే లూయిస్‌ క్యాచ్‌ను పంత్‌ విడిచిపెట్టాడు. అప్పటికి 16 పరుగులతో ఉన్న లూయిస్‌.. 40 పరుగులు చేశాడు. మ్యాచ్‌ చివర్లో అయ్యర్‌ సైతం ఒక కష్టమైన క్యాచ్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచాలనుకున్న భారత వ్యూహం బెడిసికొట్టి ఫలితం ప్రతికూలంగా వచ్చింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఎల్లుండి ముంబైలో జరుగనుంది.