ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రహానే, బూమ్రా హవా

ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌ లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, పేస్‌ బౌలర్‌ జస్ర్పిత్‌ బూమ్రా హవా కొనసాగిస్తున్నారు. వెస్టిండీస్‌ తో జరిగిన తొలి టెస్ట్ లో మంచి ప్రతిభ కనబర్చిన తర్వాత వీరిద్దరి ర్యాంకులు మరింత మెరుగయ్యాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ లో 21వ స్థానంలో ఉన్న రహానే.. ఏకంగా 10 పాయింట్లు ఎగబాకి 11 స్థానానికి చేరుకున్నాడు. ఇక బూమ్రా 5 వికెట్లు పడగొట్టి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లోకి ప్రవేశించాడు. గతంలో 16వ ర్యాంకింగ్ లో ఉన్న బూమ్రా.. 7వ స్థానానికి ఎగబాకాడు.

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 910 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  904 పాయింట్లతో స్మిత్‌ రెండో స్థానంలో ఉండగా.. 878 పాయింట్లతో విలియమ్సన్‌ మూడో స్థానం, ఛతేశ్వర పుజారా 856 పాయింట్లతో నాలుగు స్థానంలో నిలిచాడు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ హెన్రీ నికోలస్‌ 749 పాయింట్లతో ఐదోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ కు మరపురాని విజయాన్ని అందించిన బెన్‌ స్టోక్స్‌ ఆల్ రౌండర్ల జాబితాలో 411 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.