ఇక అవినీతి అధికారుల పప్పులు ఉడకవు!

ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో  లెక్కగా మారింది గ్రామాల్లో పరిస్థితి. సీఎం కేసీఆర్‌ ముందు నడుస్తూ..  ఏర్పాటు చేసిన ధర్మ గంట అధికారుల గుండెల్లో  రైళ్లు పరుగెడుతున్నాయి.  కాసుల కోసం ప్రభుత్వ  భూములను.. అప్పనంగా కట్టబెడుతున్న అధికారుల భాగోతం బట్టబయలవుతుంది. అవినీతి అధికారులపై సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి భారీ ప్రతిస్పందన వస్తుంది. సారూ మీ వెంట మేము అంటూ.. తమ పరిధిలో జరిగిన అవినీతి భూదందాను.. సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా  బాల్కొండలో వర్షపు నీటిని తీసుకెళ్లే.. కాలువ భూములను రియల్ మాఫియా కబ్జా చేసింది. వారికీ స్థానిక రెవెన్యూ అధికారులు ఫుల్ సపోర్ట్‌ చేశారు. దాంతో కొండల నుంచి వచ్చే నీరు అలీం చెరువులో కలిసే వరకూ.. ఉన్న భూములు కబ్జాకు గురవుతున్నాయి. గ్రామం మధ్యలో ఉండడంతో.. భూములకు భారీ గా విలువ పెరిగింది. దాంతో అధికారులు కూడా.. కాసులకు కక్కుర్తి పడి.. కబ్జాదారుల పేరిట భూములను బదలాయించారు. కబ్జా విషయాన్ని టీ న్యూస్‌ కు స్థానికులు చేరవేశారు. వెంటనే స్థానికంగా పరిశీలించిన టీ న్యూస్‌.. కబ్జా జరిగిన వైనం ను నిర్ధారించింది.

కెనాల్ ఉన్న భూమి సర్వే నెంబర్ 1362తో ఉంది. దీనికి అధికారులు 1362/1 అనే సర్వే నెంబర్ తో రెండు వేల సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పటి అధికారులు అనుమతులు ఇచ్చారు.  1362 సర్వే నెంబర్ తో ఉన్న  కెనాల్ కందకం చరాయి భూమిని 2004 సంవత్సరంలో అప్పటి స్పెషల్ తహసీల్దార్ బావయ్య, నాగన్న, రాజన్నల పేరు మీద రాసిచ్చేశారు. దీంతో  కెనాల్ మీద ఇళ్ల నిర్మాణం ప్రారంభమయింది. గ్రామం నడిబొడ్డున తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీస్ వెనకాలే ఈ కెనాల్ ఉండటంతో దాదాపు 50 కోట్ల రూపాయల మేర ఈ కెనాల్ భూమి విలువ ఉంటుంది. దీంతో విచ్చల విడిగా ఈ కెనాల్ భూమిని రియల్టర్లు అధికారులకు అమ్యామ్యాలు ఇచ్చి అప్పనంగా కాజేశారు. సీఎం కేసీఆర్ ధర్మగంట మోగించటంతో .. కబ్జా విషయాన్ని టీ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ కు కూడా  ఫిర్యాదు చేశారు.

 కొండలు, గుట్టల నుంచి వచ్చే వర్షం నీరు ఈ కెనాల్ గుండా ఊరి చివరన గల అలీం చెరువులో నీరు వెళ్తుంది. ప్రస్తుతం 1362 చరాయి కెనాల్ కు సంబంధించిన భూమి పుర్తిగా కబ్జాకు గురి కావటంతో… భారీగా వర్షాలు కురిసిన సమయంలో ఇళ్లలోకి నీరు చేరుతోంది. అధికారులు చేస్తున్న తప్పిదాలకు అమాయకులు బలికావాల్సి వస్తోంది. ఇదే కెనాల్ భూమిపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ ను ప్రశ్నించగా రికార్డులు పరిశీలించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని టీన్యూస్ కు తెలిపారు.  గతంలో తహసీల్దార్లుగా బాద్యతలు చేపట్టిన కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి కెనాల్ భూమి అని చూడకుండా  రియల్టర్లకు అప్పనంగా  కట్టబెట్టేశారు.  దశాబ్దాల కాలంగా చరాయి భూమి కందకంగా ఉన్న ఉన్న ఈ కెనాల్ ను పూర్తిగా కబ్జాకు గురి చేశారు. రేపు  భారీగా వర్షాలు పడితే ఆ వర్షపు నీరు ఇళ్లలోకి చేరాల్సిందే.. అయితే కెనాల్ పై ఇళ్లు నిర్మించుకున్న సదరు వ్యక్తులను ప్రశ్నిస్తే.. తమకు పట్టా భూమి అని చెప్పి అమ్మారని చెపుతున్నారు

కెనాల్ పైనే పూర్తిగా నిర్మాణాలు కానిచ్చేశారు. దీనికి బాధ్యులు ఎవరు? ఆ భూమిని కొన్న వారా లేదా రియల్టర్లకు కట్టబెట్టిన అధికారులా  అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే గ్రామంలోని ఓ వ్యక్తి ఈ కెనాల్ భూమి కబ్జాపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు. మరి అధికారులు చర్యలు తీసుకుంటారా? నామ మాత్రంగా వదిలేస్తారా అని గ్రామస్థులు భావిస్తున్నారు.