సాగునీటి ప్రాజెక్టుల్లోనే ఓ అద్భుతం ఆవిష్కారం!

ఈ వానకాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణ గడ్డ మీద ఉన్న చెరువులను నింపాలన్న ప్రభుత్వ జల సంకల్పం మేరకు.. పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధానంగా  గోదావరి నదిపై నిర్మిస్తున్న మూడు బరాజ్‌లు తుది రూపు సంతరించుకుంటుండగా.. గోదారమ్మను ఎత్తి పోసి, బీడు భూములను పండించడంలో కీలకమైన మోటర్ల బిగింపు పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. రెండు చోట్ల మోటర్ల నీటిని ఎత్తిపోసే పరీక్ష కు అధికారులు సిద్ధమయ్యారు. మేడారం బరాజ్‌ ఫోర్‌ షోర్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు నిర్మిస్తున్న కన్నెపల్లి పంపుహౌస్‌తో పాటు ఎల్లంపల్లి తర్వాత జలాలను మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు చేపట్టిన మేడారం పంపుహౌస్‌లోనూ వెట్‌ రన్‌ కు అధికారులు రంగం సిద్ధం చేశారు.

వానకాలంలో నిరవధికంగా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సాంకేతికంగా సిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించారు. అటు మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు మార్గంలో సవాల్‌గా మారిన జంట సొరంగాలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కేవలం కిలోమీటర్‌లోపు  లైనింగ్‌ పనులు పూర్తయితే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. గోదావరిని ఒడిసిపట్టే బరాజ్‌లు మరోవైపు పౌర రవాణాకు కూడా వారధులుగా మారనుండటం పరిసర గ్రామాల ప్రజలకు వరంగా మారనున్నది. బరాజ్‌లపై బీటీ రోడ్ల నిర్మాణం తో ఇప్పటికే వాహనాల రాకపోకలకు అన్నారం, సుందిల్ల బరాజ్‌లు అందుబాటులోకి రాగా..  మేడారం బరాజ్‌ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నదని అధికారులు చెప్తున్నారు. వీటిపై రాకపోకలకు అనుమతి ఇస్తే లక్షల మంది వాహనదారులకు వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి.

కాళేశ్వరంలో భాగంగా నిర్మిస్తున్న మూడు బరాజ్‌ల పనులు చివరి దశలో ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నదిపై 1628 మీటర్ల పొడవున నిర్మిస్తున్న మేడిగడ్డ బరాజ్‌ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది. ఇక్కడ 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. మొత్తం 85 గేట్లు అమర్చాల్సి ఉండగా..  ప్రస్తుతం 67 గేట్ల పనులు జరుగుతున్నాయి. ఇందులో 52 గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది. రెండు రోజుల్లో మిగిలిన గేట్ల పనులను మొదలు పెట్టనున్నారు. బరాజ్‌ నిర్మాణానికి మొత్తం 18.40 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేపట్టాల్సి ఉండగా 33 వేల క్యూబిక్‌ మీటర్ల మేర పని మాత్ర మే మిగిలి ఉన్నది. అందులోనూ ప్రధాన బరాజ్‌కు సంబంధించి ఏడు వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే చేయాల్సి ఉన్నది. బరాజ్‌కు రెండు వైపులా సుమారు 18.50 కిలోమీటర్ల బండ్‌ నిర్మించాల్సి ఉండగా.. ఐదారు కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి కావాల్సి ఉన్నది. బరాజ్‌ నిర్మాణం పూర్తయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు రవాణా మార్గం సుగమం అవుతుంది. రాకపోకలకు గాను వచ్చే నెల ఈ బరాజ్‌ అందుబాటులోకి రానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరిపై నిర్మిస్తున్న బరాజ్‌, పంపుహౌజ్‌లు ఎంత కీలకమో ఎల్లంపల్లి రిజర్వాయర్‌ తర్వాత గోదావరి జలాలను మిడ్‌ మానేరుకు తరలించేందుకు చేపడుతున్న పనులు కూడా  అంతే కీలకం. ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా తరలించిన తర్వాత ప్యాకేజీ-6లో భాగంగా నిర్మిస్తున్న మేడారం పంపుహౌస్‌ లోని మోటర్ల ద్వారా నీటిని సుమారు 115 మీటర్ల మేర ఎత్తి మేడారం రిజర్వాయర్‌లో పోయనున్నారు. ఇందుకు అక్కడ 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆపై గోదావరి జలాలు ప్యాకేజీ-7లో భాగంగా నిర్మిస్తున్న జంట సొరంగాల ద్వారా ముందుకు పోవాల్సి ఉన్నది. ఈ సొరంగాల నిర్మాణంలోనే నీటిపారుదల శాఖ అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. కొన్ని చోట్ల రాక్‌ కాకుండా  కేవలం మట్టి పొరలే రావటంతో కుప్పకూలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి నిపుణులను కూడా  రప్పించి, అత్యంత జాగ్రత్తగా సవాళ్లను అధిగమించేందుకు చాలా సమయం పట్టింది. మొత్తంగా జంట సొరంగాల నిర్మాణం పూర్తి కాగా లైనింగ్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఒక్కో సొరంగం 11.24 కిలోమీటర్ల పొడవు ఉండగా.. రెండు వైపులా కలిపి కేవలం 845 మీటర్ల మేర లైనింగ్‌ మాత్రమే మిగిలి ఉన్నది. మరో నెల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిందంటే.. మేడారం రిజర్వాయర్‌ నుంచి జలాలు రామడుగు పంపుహౌస్‌ వరకు వస్తాయి. అక్కడ ఉన్న మోటర్లతో నీటిని ఎత్తిపోస్తే.. ఎస్సారెస్పీ వరదకాల్వ.. తద్వారా మిడ్‌ మానేరుకు గోదారమ్మ పరుగు తీస్తుంది. అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జలాల తరలింపునకు మార్గం సుగమం అవుతుంది.

గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు మూడు బరాజ్‌ల ఫోర్‌షోర్‌ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌ల పనులు కీలకదశకు చేరుకున్నాయి. సివిల్‌ పనులు పూర్తి కాగా పంపులు, మోటార్ల బిగింపు పనులు చురుకుగా సాగుతున్నా యి. సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవడం, పంపుహౌస్‌ల్లోనూ ఇప్పటి వరకు పూర్తయిన పనుల దరిమిలా  కన్నెపల్లి పంపుహౌస్‌లో వెట్‌ రన్‌ కు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ రెండు టీఎంసీలను ఎత్తిపోసేందుకు పంపు లు, మోటర్లను సిద్ధం చేస్తుండగా అదనంగా మరో టీఎంసీని ఎత్తిపోసేందుకు వీలుగా అమర్చనున్న పంపులు, మోటర్ల కోసం సివిల్‌ పనులు కూడా  పూర్తి చేశారు. మేడిగడ్డ బరాజ్‌లో నిల్వ ఉన్న నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 మోటర్లను ఏర్పాటు చేయాల్సి  ఉన్నది. ఇప్పటి వరకు ఏడు మోటర్లు సిద్ధమయ్యాయి. మరో రెండింటి బిగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. నెలాఖరు నాటికి ఒకటి, వచ్చే నెలలో మరొకటి అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన రెండు మోటర్లను వచ్చే నెలాఖరు కల్లా ఏర్పాటు చేయనున్నారు. అన్నారం పంపుహౌస్‌ వద్ద సివిల్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 1.20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనికి గాను దాదాపు 1.18 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని, 6.84 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనికిగాను 6.31 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. ఇక్కడ ఎనిమిది మోటర్లను బిగించాల్సి ఉండగా.. ఆరింటిని బిగించారు. మరో  రెండింటిని బిగిస్తున్నారు. సుందిల్ల పంపు హౌస్‌ వద్ద సివిల్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక్కడ తొమ్మిది మోటర్లను బిగించాల్సి ఉండగా.. నాల్గింటిని బిగించారు. మూడు మోటర్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. అన్నారం బరాజ్‌ ఇప్పటికే పూర్తవడంతో పాటు బరాజ్‌పై బీటీ రోడ్డు నిర్మాణ పనులు కూడా చివరి దశకొచ్చాయి. 1270 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బరాజ్‌కు 66 గేట్లకుగాను అన్నింటినీ బిగించారు. బరాజ్‌ చివర్ల నిర్మించాల్సిన గైడ్‌, ఫ్లడ్‌ బ్యాంకుల నిర్మాణ పనులూ పూర్తయ్యాయి. ఈ బరాజ్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. ఈ బరాజ్‌ నిర్మాణం వల్ల మహదేవ్‌పూర్‌ – చెన్నూరు ప్రాంతాల మధ్య రాకపోకలకు మార్గం సుగమం కానున్నది.  ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణం కూడా  చివరి దశకొచ్చినందున అనధికారికంగా  కొన్ని వాహనాలు వెళ్తున్నాయి.

తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సుందిల్ల బరాజ్‌ నిర్మాణం పూర్తయింది. 10.55 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనికిగాను కేవలం 119 క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే మిగిలి ఉన్నది. మొత్తం 74 గేట్ల బిగింపు పూర్తయింది. బరాజ్‌పై బీటీ రోడ్డు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నా యి. 22 కిలోమీటర్ల గైడ్‌ బండ్లకు గాను కిలోమీటర్‌ మేర పనులు మిగిలాయి. రెవిట్‌మెంట్‌ పనులు కూడా  చివరిదశకొచ్చా యి. సుందిల్ల బరాజ్‌ నిర్మాణం వల్ల చెన్నూరు- మంథని ప్రాంతాల మధ్య రాకపోకలకు మార్గం ఏర్పడుతుంది. వచ్చే నెల రాకపోకలకు అనువుగా మారనున్నది.