మోదీపై బయోపిక్‌ కాదు కామెడీ సినిమా తీయాలి: ఊర్మిళ

ప్రధాని నరేంద్ర మోదీపై బయోపిక్‌ కాదు కామెడీ సినిమా తీయాంటూ సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఊర్మిళా మతోండ్కర్‌ ఎద్దేవా చేశారు మోదీ జీవితం ఆధారంగా బయోపిక్‌ తీయడాన్ని తప్పుపట్టిన ఆమె.. ఆయనేం సాధించారని బయోపిక్‌ తీశారంటూ ప్రశ్నించారు. మోదీ బయోపిక్‌లో 56 అంగుళాల ఛాతీ ఉన్న ఒక వ్యక్తిని దేశానికి ప్రధాని చేసినా..  ఆయన ప్రజలకు ఏమీ చేయలోకపోయారని చూపించాలన్నారు. ప్రధాని కాకముందు 2014 ఎన్నికల ప్రచారాల్లో ఎన్నో హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టింది సినిమాలో ఉండాలన్నారు. తీరా ప్రధాని అయ్యాక ప్రజలను మోసం చేసిన విధానాన్ని చూపించాలన్నారు. ఊర్మిళ ముంబయి నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది.

మరోవైపు..  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ బయోపిక్‌  విడుదలను నిలిపివేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇందుకు నిరాకరించింది. ఆ తర్వాత ఈ సినిమాపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని ఆదేశించిండంతో విషయం మరోసారి సుప్రీంను చేరింది. దీంతో ముందు ఎన్నికల అధికారులు సినిమాను చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇటీవల అధికారులు సినిమాను వీక్షించారు. దీనిపై ఈసీ నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.