జైపూర్‌ లో ‘మహీ’ మ్యాచ్‌

జైపూర్‌ వేదికగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛాంపియన్‌లా ఆడింది. రాజస్థాన్‌ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి మరో విజయాన్ని అందుకుంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న చెన్నై.. కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రాజస్థాన్‌కు పరుగులు రావడం కష్టంగా మారింది. ఓపెనర్‌ అజింక్యా రహానే 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచగా.. అటు తర్వాత జోస్‌ బట్లర్‌ 23 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత సంజూ శాంసన్‌ , రాహుల్‌ త్రిపాఠి, స్మిత్‌ లు సైతం తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ కు చేరారు. కాగా చివర్లో బెన్‌ స్టోక్స్‌ 28 పరుగులతో ఆదుకోవడంతో.. రాజస్తాన్‌ 100 పరుగులు దాటింది. చివర్లో రియాన్‌ పరాగ్‌ 16 పరుగులు, జోఫ్రా ఆర్చర్‌ 13 పరుగులు చేయడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.

MS.Dhoni

ఇక ఛేదనలో సీఎస్‌కే కు ఆదిలోనే షాక్‌ తగిలింది. వాట్సన్‌ డకౌట్‌ కాగా.. రైనా 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అనంతరం డుప్లెసిస్‌ 7, జాదవ్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ధోనీ-రాయుడు మరో వికెట్‌ పడకుండా నెమ్మదిగా ఆడారు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 18 పరుగులు కావాల్సి ఉంది. స్టోక్స్‌ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతిని జడేజా సిక్సర్‌ కొట్టాడు. రెండో బంతికి సింగిల్‌ తీయగా అది నోబాల్‌ కావడంతో ఫ్రీ హిట్‌ రూపంలో సీఎస్‌కేకు మరో అవకాశం వచ్చింది. తర్వాత బంతికి ధోని రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి ధోనిని స్టోక్స్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే చివరి బంతికి సాంట్నర్‌ సిక్సర్‌ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.