ఇదే అందరూ చేస్తే ఎంత బాగుండో!

దేశంలో అవినీతి రహిత పాలన రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, ముఖ్యంగా పేదవాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవినీతి, లంచగొండుతనం.. ఏ పని కావాలన్నా పై అధికారుల నుంచి ప్యూన్‌ వరకూ అందరి చేయి తడపాల్సిన పరిస్థితి. ఆఖరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కూడా మధ్యవర్తులు లంచం ఇస్తేనే ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాలని సీఎం కేసీఆర్ ప్రతిన బూనారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు.

దీనికి నల్గొండ జిల్లా మునుగోడు తహసీల్దారు కార్యాలయం వెంటనే స్పందించింది. కార్యాలయం నోటీసు బోర్డుపై సోమవారం ఓ ఫ్లెక్సీ అంటించింది. ఇది అవినీతి రహిత కార్యాలయమని, ఇక్కడి రెవెన్యూ సేవలకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వరాదని ప్రకటించింది. సిబ్బందిలో ఎవరైనా అడిగితే తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌లకు ఫిర్యాదు చేయాల్సిన ఫోన్‌ నంబర్లను, ఒకవేళ వాళ్లు కూడా అడిగితే నల్గొండ కలెక్టర్‌, ఆర్డీవోల నంబర్లు అందులో వెల్లడించారు. ప్రతి దరఖాస్తునూ నిర్ణీత సమయంలో తప్పకుండా పరిష్కరిస్తామన్న హామీ ఇచ్చారు. నిజంగా అంతటా ఈ పద్ధతి వచ్చి..కచ్చితంగా ఆచరణలోకి రావాలే కానీ.. ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది.