రెండో వన్డే మనదే

ఆస్ట్రేలియాపై భారత్‌ మరో విజయం సాధించింది..! దాదాపుగా చివరి వరకు విజయం కంగారూలవైపే ఉన్నా.. ఆఖర్లో అదృష్టం టీమిండియాను వరించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీకి తోడు. విజయ్ శంకర్ ఆల్‌రౌండ్ షోతో.. రెండో వన్డేలో భారత్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్‌సేన 2-0 ఆధిక్యంలో నిలిచింది.

తొలుత టాస్‌ ఓడి.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసింది. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. ఆరు బంతులు ఆడిన రోహిత్ డకౌటై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ .. ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధవన్ అవుటయ్యాడు. 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు బాధ్యతను భుజాలపైకి ఎత్తుకున్న కెప్టెన్ కోహ్లీ ఆచితూచి ఆడాడు.

virat-kohli

ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను పునర్ నిర్మించాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు పెవిలియన్ చేరుతున్నా కోహ్లీ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. 120 బంతుల్లో పది ఫోర్లతో 116 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిదో వికెట్‌గా కోహ్లీ అవుటయ్యాక చివరి రెండు వికెట్లను భారత్ వెంటవెంటనే కోల్పోయింది. దీంతో 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసింది.

251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ చివరి వరకు పోరాడి చేతులెత్తేసింది. 83 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆసీస్ విజయం దిశగా పయనించింది. అయితే, ఆ తర్వాత అదే స్కోరు వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, బుమ్రాలు పదునైన బంతులతో ఆసీస్‌ను కట్టడి చేశారు. చివర్లో మార్కస్ స్టోయిన్స్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారినప్పటికీ చివరి ఓవర్ వేసిన విజయ్ శంకర్.. స్టోయిన్స్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికే ఆడం జంపాను బౌల్డ్ చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ముందంజలో ఉంది. 8వ తేదీన రాంచీలో మూడో వన్డే జరగనుంది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును తిరగరాసేందుకు పరుగుల మెషిన్ కోహ్లీ చేరువలో ఉన్నాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేయగా..  కోహ్లీ  నాగ్‌పూర్ వన్డేలో 40వ సెంచరీ సాధించాడు. తక్కువ మ్యాచుల్లో 40 సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచిండు.