ఆ సినిమాల విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమాల విడుదల విషయంలో జోక్యం చేసుకోలేమని హై కోర్టు తేల్చి చెప్పింది. ఈ సినిమాల విడుదలను నిలిపివేయాలని దాఖలై పిటిషన్ను కొట్టి పారేసింది. ఎన్నికల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో వీటిని విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హై కోర్టు .. రెండు సినిమాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

దివంగత ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్మీపార్వతి వచ్చిన తర్వాత ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు, ఎన్టీఆర్‌, లక్మీపార్వతి మధ్య ఉన్న బంధం ఆధారంగా.. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కించారు.  మరోవైపు వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి.. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం ..అనంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం’ సినిమా తెరకెక్కించారు.