కొత్త మంత్రులు, ప్రొఫైల్

తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు అంతా సిద్ధం అయ్యింది. మంత్రివర్గం జాబితాను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ముందుగా 10 మందికి కేబినెట్ లో స్థానం కల్పించారు. పాత, కొత్తల కలయికగా మంత్రుల కూర్పు జరిగింది. మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్లకు సీఎం కేసీఆరే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో ఉదయం పదకొండున్నరకు గవర్నర్ నరసింహన్.. మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

తెలంగాణ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ కు రెండోసారి చోటు దక్కింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల.. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ సమయం నుంచే టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పనిచేశారు. 2014 ప్రభుత్వంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పని చేశారు ఈటెల.

 

ఈటెల రాజేందర్ మార్చి 3, 1964 లో జన్మించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారూ టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధ్దాటితో అందరిని ఆకట్టుకున్నారు. 1964 మార్చి 20వ తేదీన జన్మించిన ఈటెల బీఎస్సీ చదివారు. ఈయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు దక్కాయి.

హూజురాబాద్ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆయనకు ఈ సారి స్పీకర్ పదవి దక్కుతుందని జోరుగా చర్చ జరిగింది. దీంతో ఈటెల కేసీఆర్ తో చర్చించి సున్నితంగానే స్పీకర్ పదవి వద్దని చెప్పారట. దీంతో ఈటెలకు మంత్రి వర్గంలోనే బెర్తు ఖాయమనే హామీ కేసీఆర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈటెల రాజేందర్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక మార్పులు తీసుకు వచ్చారని, సౌమ్యునిగా పేరుండడంతో ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఖాయమని నేతలు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈటెలకు మొదటి బెర్తులోనే మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అయితే ఈటెలకు గతంలో నిర్వహించిన ఆర్ధిక శాఖనే తిరిగి అప్పగిస్తారా లేక శాఖ మార్పు జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

etela-rajendar
ఈటెల రాజేందర్

సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డికి కేబినెట్ లో రెండోసారి అవకాశం దక్కింది. ఆయన ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్ వెన్నంటి నడిచారు. గులాబీ పార్టీలో చురుగ్గా పని చేశారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2014లో మొదటిసారి, 2018 ముందస్తు ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ప్రభుత్వంలో విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖల మంత్రిగా పని చేశారు.

jagadish-reddy
గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి

ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి రెండోసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. నిర్మల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంద్రకరణ్‌ రెడ్డి.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీ గెలిచారు. 1981 లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1987లో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో టీఆర్ఎస్ లో చేరారు. గత ప్రభుత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా పని చేశారు.

indrakaran-reddy
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్ర తొలి మంత్రి వర్గంలో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మళ్లీ మంత్రి పదవి వరించింది. రాష్ట్ర రెండో అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..తన మంత్రి వర్గంలో తలసానికి చోటు కల్పించారు.

సికింద్రాబాద్ లో 1965 అక్టోబర్ 6న తలసాని శ్రీనివాస్ యాదవ్..జన్మించారు. స్వర్ణతో తలసాని వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన..సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని..ఎనలేని సేవలు అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీలాంటి బృహత్తర పథాకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరాలా కృషి చేశారు. దీంతో సీఎం కేసీఆర్..రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత..తన మంత్రి వర్గంలోకి తలసానికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.

గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తలసాని ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక మరియు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించిన తలసానికి… సీఎం కేసీఆర్ మరోసారి మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు.

thalasani-srinivas-yadav
తలసాని శ్రీనివాస్ యాదవ్

ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు మంత్రిగా తొలిసారిగా స్థానం కల్పించారు సీఎం కేసీఆర్. కొప్పుల తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పని చేశారు కొప్పుల ఈశ్వర్‌.

ఈశ్వరన్న..! ఈ పేరు ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కొప్పుల ఈశ్వర్ ను నియోజకవర్గ ప్రజలు పిలుచుకునే పేరు. పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామం ఆయన స్వస్థలం. 1959 ఏప్రిల్ 20న కొప్పుల లింగయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించారు. తన తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో సెటిలయ్యారు. కొప్పుల ఈశ్వర్ చదువు మొత్తం గోదావరిఖనిలో పూర్తైంది. బీఏ వరకు చదువుకున్న కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికుని గా 27 సంవత్సరాల పాటు పనిచేశారు. అటు తర్వాత… కొతం కాలం తెలుగుదేశం పార్టీలో ఎస్సీ సెల్ బాధ్యతలు నిర్వహించారు.

కొప్పుల ఈశ్వర్ 1994లో మేడారం నియోజకవర్గం నుంచి తొలిసారిగా టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అటు తర్వాత 1999లో టిడిపి టికెట్ రాకపోయినా ఆయన నిరాశపడలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తోనే పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మేడారం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమనేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు కొప్పుల. 2009 శాసనసభ ఎన్నికలలో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ 2010లో మరోసారి రాజీనామా చేసిన ఈశ్వర్.. ఆ ఉప ఎన్నికల్లోనూ నాలుగోసారి గెలుపొందారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… 2014లో ధర్మపురి నుంచి ఐదోసారి విజయఢంకా మోగించారు కొప్పుల ఈశ్వర్. 2015లో ప్రభుత్వ చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ ను నియమించారు సీఎం కేసీఆర్. మేడారం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… అభివృద్దికి పాటుపడుతున్నారు. మేడారం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… అభివృద్దికి పాటుపడుతున్నారు.

2015లో ప్రభుత్వ చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ ను నియమించారు సీఎం కేసిఆర్. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఈశ్వర్ కొనసాగుతున్నారు.

 

 

koppula-eshwar
కొప్పుల ఈశ్వర్

వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి తొలిసారి రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. టీఆర్ఎస్‌ ఆవిర్భావం నుంచే కేసీఆర్‌ వెన్నంటి నిలిచిన నేతల్లో నిరంజన్ రెడ్డి ఒకరు. ఉద్యమ సమయం నుంచీ టీఆర్ఎస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంటుగా ఐదేళ్లు పని చేశారు. గత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా వ్యవహరించారు.

nirangjan-reddy
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డికి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దొరికింది. 2001లో ప్రశాంత్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా పని చేశారు.

vemula-prashant-reddy
వేముల ప్రశాంత్ రెడ్డి

పాలకుర్తి ఎమ్మెల్యే ఎరబెల్లి దయాకర్ రావుకు తొలిసారి కేబినెట్ లో స్థానం కల్పించారు సీఎం కేసీఆర్. ఎర్రబెల్లి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1982లో ఎర్రబెల్లి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999 నుంచి 2003 వరకు అప్పటి ప్రభుత్వ విప్‌గా పని చేశారు. 2016 లో టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

yerrabelly-dayakar
ఎరబెల్లి దయాకర్ రావు

మేడ్చల్ ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డికి మంత్రివర్గంలో మొదటిసారి అవకాశం దక్కింది. వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి.. 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2016 లో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

వ్యాపారవేత్త, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ చామకూర మల్లారెడ్డికి తగిన గుర్తింపు లభించింది. తాను అడుగు పెట్టిన అన్ని రంగాల్లో మంచిపేరు తెచ్చుకున్న మల్లారెడ్డికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. రెండోసారి ఏర్పాటైన టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మల్లారెడ్డికి మంత్రి పదవి దక్కింది.

హైదరాబాద్ బోయిన్‌ పల్లిలో సెప్టెంబర్ 9, 1953లో చామకూర మల్లారెడ్డి జన్మించారు. వెస్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్‌, మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం వ్యాపారవేత్తగా మారి, మంచిపేరు సంపాదించారు. 2014లో మల్లారెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి, గెలుపొందారు. అనంతరం 2016 లో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సభ్యులతో కలిసి తెలంగాణ గొంతుకను వినిపించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. రెండవసారి ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డికి తగిన గుర్తింపునిస్తూ సీఎం కేసీఆర్ మంత్రి పదవిని ఇచ్చారు.

malla-reddy
చేమకూర మల్లారెడ్డి

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు ఈసారి మంత్రిగా అవకాశం లభించింది. శ్రీనివాస్ గౌడ్ 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘానికి అధ్యక్షుడిగా, రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలకు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ సంఘం నాయకునిగా.. ఉద్యమ సమయలో కీలకపాత్ర పోషించారు.

srinivas-goud
శ్రీనివాస్ గౌడ్

రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం అంటే 120 మందిలో సీఎంతో కలిపి 18 మందికి క్యాబినెట్‌ లో చోటు కల్పించే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా 10 మందితో కలిపి మొత్తం 12 మందితో మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ఇంకో 6 ఖాళీలు లోక్ సభ ఎన్నికల తరవాత భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. మహిళలు సహా పలు సామాజిక సమీకరణాలకు సంబంధించి మరికొంత మందికి అపుడే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.