ప్రశాంతంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం అశేష జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా దాదాపు ముగిసింది. బాలాపూర్ నుంచి చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా హుస్సేన్‌ సాగర్ వరకు నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తి పాటలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, నృత్యాలతో నిమజ్జన యాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో రికార్డుస్థాయిలో రూ.16.60 లక్షలు పలికింది. మధ్యాహ్నం ఒంటిగంటకే ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం పూర్తవగా, నగరంలోని మిగతా విగ్రహాలు దాదాపు తెల్లవారుజాము వరకు గంగమ్మ ఒడికి చేరాయి. ఇవాళ కూడా ఇంకా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది.

ఆదివారం ఉదయం బాలాపూర్‌లో లడ్డూవేలం పాట ముగియగానే శోభాయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్, అబిడ్స్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నది. ముందుగా అనుకున్న ప్రకారం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకే పూర్తిచేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ వినాయకుడి పూజల్లో పాల్గొన్న ఆయన.. సికింద్రాబాద్, నెక్లెస్‌రోడ్, మదీన, చార్మినార్, ఎంజేమార్కెట్ తదితర ప్రాంతాల్లో వినాయకులను దర్శించి, ఊరేగింపునకు స్వాగతం పలికారు. బాలాపూర్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి పాల్గొని నిమజ్జన యాత్రను ప్రారంభించారు.

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిమజ్జన తీరును డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఆదివారం నాడు హుస్సేన్‌సాగర్‌తోపాటు 35 చెరువుల్లో 54,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు ప్రకటించారు.

నిమజ్జనాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 35 వేల మంది పోలీసు సిబ్బంది నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు సహకరించారు. నిమజ్జనం కోసం 4 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే నగరంలో ఉన్న 2.40 లక్షల సీసీ కెమెరాలు సైతం నిఘా పెట్టాయి.

ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున హుస్సేన్‌సాగర్ కు తరలివచ్చారు. దీంతో సాగరతీరం జనజాతరను తలపించింది. నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ఎంజే మార్కెట్, సచివాలయం, చార్మినార్ ప్రాంతాల్లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు వేదికలను ఏర్పాటు చేసి భక్తులకు స్వాగతం పలికారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుని నిమజ్జనం సాఫీగా సాగేందుకు శ్రమించారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వీపింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలిగించారు. జలమండలి అధికారులు 101 ప్రాంతాల్లో 30 లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీచేశారు. పలు సేవా సంస్థలు, దాతలు భక్తులకు దారిపొడవునా ప్రసాదాలు, మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేసి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు.