లోక్‌ సభ మాజీ స్పీకర్ సోమనాథ్‌ ఛటర్జీ కన్నుమూత

లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ(89) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆదివారం నాడు కోల్ కత్తాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. యూపీఏ-1  ప్రభుత్వం లోక్ సభ స్పీకర్ గా పని చేశారు సోమనాథ్.

1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

సోమనాథ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సహా పలువురు ఎంపీలు సంతాపం ప్రకటించారు. భారత రాజకీయాల్లో సోమనాథ్ చటర్జీ మేరునగధీరుడన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయన మరింత బలం చేకూర్చారని,  అణగారిన వర్గాల తరుపన బలమైన గళం వినిపించారని కొనియాడారు. సోమనాథ్‌ చటర్జీ ఓ వ్యవస్థ అన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. పార్టీలకు అతీతంగా పార్లమెంటేరియన్లు అందరూ ఆయనను గౌరవించేవారని గుర్తు చేశారు.

సోమనాథ్ ఛటర్జీ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చట్ట సభలు ఉన్నత ప్రమాణాలతో నడిచేందుకు అయన చేసిన కృషి ఎనలేనిదని, గొప్ప పార్లమెంటేరియన్ గా చరిత్రలో నిలిచిపోతారని సీఎం అన్నారు. తాను కేంద్ర మంత్రిగా, ఎంపీ గా ఉన్నప్పుడు సోమనాథ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం తాము ఎంపీలుగా రాజీనామా చేసినప్పుడు స్పీకర్ గా ఆయనే ఉన్నారని, సభలో తమ వాదనను వినిపించే సందర్భంలో సహృదయంతో వ్యవహరించారని చెప్పారు.