ఫిఫా వరల్డ్ కప్‌ సెమీస్‌: నేడు బెల్జియం-ఫ్రాన్స్‌ ఢీ

ఫిఫా వరల్డ్ కప్‌లో సూపర్ ఫైట్‌కు సెయింట్‌ పీటర్స్ బర్గ్ వేదిక కానుంది. మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం యావత్ ఫుట్‌బాల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫైనల్ బెర్తు కోసం 1998 ఛాంపియన్ ఫ్రాన్స్.. నయా సెన్సేషన్ బెల్జియం తలపడనున్నాయి. అద్భుతమైన ఫాంలో ఉన్న ఇరు జట్ల మధ్య పోరుపై అంచనాలు ఊపందుకున్నాయి. వరల్డ్ కప్ విజేతను ఈ సెమీఫైనల్ మ్యాచ్‌ నిర్ణయిస్తుదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన ఫలితాలతో సాగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్‌ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పన్నెండేళ్ల తర్వాత వరల్డ్ కప్ సెమీఫైనల్‌ ఆడుతున్న ఫ్రాన్స్.. ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు గత కొంతకాలంగా తిరుగులేని జట్టుగా ఎదిగిన బెల్జియం కూడా సరికొత్త ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని కసిగా చెలరేగుతోంది.

1998లో ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్.. 2006లో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. తిరుగులేని అటాకింగ్‌తో, దుర్బేధ్యమైన డిఫెన్స్ ఫ్రాన్స్ సొంతం. భారీ అంచనాల నడుమ టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రాన్స్.. అందుకు తగ్గట్టుగా రాణించింది. 1998 వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టు కెప్టెన్ డిడియర్ డెష్‌ఛాంప్స్.. ప్రస్తుత జట్టుకు కోచ్. కోచ్‌గా మరోసారి ఫ్రాన్స్‌ ను విశ్వవిజేతగా నిలపాలని  డెష్‌చాంప్స్ ఆరాటపడుతున్నాడు. కోచ్ వ్యూహాలకు అనుగుణంగా ఫ్రాన్స్ సమిష్టిగా చెలరేగుతోంది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన ఫ్రాన్స్.. తర్వాత నాకౌట్‌లో అర్జెంటీనా, క్వార్టర్స్ లో ఉరుగ్వేపై అద్భుత విజయాలు సాధించింది. ఇదే ఊపులో సెమీఫైనల్లో బెల్జియంను కూడా ఓడించాలని సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది.

ఇక టీమ్ విషయానికొస్తే అన్ని విభాగాల్లో సూపర్ స్టార్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. నెంబర్ వన్ గోల్‌ కీపర్ హ్యూగో లోరిస్ ఫ్రాన్స్‌కు ప్రధాన బలం. నాకౌట్‌తో పాటు క్వార్టర్ ఫైనల్లో లోరిస్‌ గోల్‌ కీపింగ్ ప్రదర్శన అద్భుతం. ఇక ఫార్వర్డ్ విభాగంలో సూపర్ స్టార్ ప్లేయర్ ఆంటోని గ్రీజ్‌ మన్‌ ఫ్రాన్స్ ప్రధాన ఆయుధం. గ్రీజ్‌మన్‌తో పాటు యంగ్ స్ట్రైకర్ ఎంబప్పి, గిరార్డ్ తో ఫ్రాన్స్ అటాకింగ్‌ బలంగా కనిపిస్తోంది. సీనియర్ మిడ్‌ ఫీల్డర్ పోగ్బా, యంగ్ డిఫెండర్ బెంజమిన్ పవార్డ్ తో  దుర్బేధ్యమైన రక్షణ శ్రేణి ఫ్రాన్స్ సొంతం. అన్ని విభాగాల్లో బ్యాలెన్సింగ్‌ టీమ్‌గా కనిపిస్తోన్న ఫ్రాన్స్.. అంచనాలకు తగ్గట్టుగా ఆడితే సెమీస్ బెర్తు దక్కించుకోవడం కష్టమేమీ కాదు.

మరోవైపు రెడ్ డెవిల్స్‌.. బెల్జియం ఇటీవల ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టుగా ఎదిగింది. బెల్జియం ఫుట్‌బాల్ చరిత్రలోనే ప్రస్తుత జట్టు గోల్డెన్ జనరేషన్‌గా ప్రశంసలు అందుకుంటోంది. గత 24 మ్యాచుల్లో అపజయమన్నదే ఎరుగని అజేయ జట్టుగా బెల్జియం ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌ లో మూడో స్థానంలో ఉంది. భారీ అంచనాలతో ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన బెల్జియం గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో నాకౌట్‌ చేరింది. నాకౌట్‌లో జపాన్‌ను ఓడించిన బెల్జియం.. క్వార్టర్ ఫైనల్లో ఆల్‌టైమ్ ఛాంపియన్ బ్రెజిల్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇదే ఊపులో తొలి ప్రపంచకప్‌ సాధించాలని బెల్జియం కసిగా ఉంది.

రాబర్ట్ మార్టినెజ్ కోచింగ్‌లో రాటుదేలని బెల్జియం జైత్రయాత్రలో ఫ్రాన్స్ మాజీ ఆటగాడు థియరీ హెన్రీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెల్జియంకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న హెన్రీని.. బెల్జియం విజయాల వెనుక అన్‌సీన్ హోరోగా అందరూ అభివర్ణిస్తున్నారు. కెప్టెన్ ఏడెన్ హజార్డ్, సూపర్ మిడ్‌ ఫీల్డర్ కెవిన్ డి బ్రూయిన్‌తో పాటు స్టార్ స్ట్రైకర్ రొమేను లుకాకు బెల్జియం జట్టులో కీలక ఆటగాళ్లు. విన్సెంట్ కొంపెని, థామస్ మాన్యూర్‌, నేసర్ ఛాడ్లీ, ఫెలాయ్‌నీ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో బెల్జియం రక్షణ శ్రేణి పటిష్టంగా ఉంది. బ్రెజిల్‌పై విజయంతో తిరుగులేని ఆత్మవిశ్వాసంలో ఉన్న బెల్జియం ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్‌లో అడుగు పెట్టాలని భావిస్తోంది.

అటు ఫ్రాన్స్, ఇటు బెల్జియం.. మెరుపు అటాకింగ్ వ్యూహంతో చెలరేగుతున్న జట్లు. దీంతో తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో గోల్‌ ఫెస్ట్ ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అంచనాలు నిలబెట్టాలని ఫ్రాన్స్‌.. మరో సంచలనం సృష్టించాలని బెల్జియం ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడనున్నాయి.