వన్డే సిరీస్‌ దక్కేది ఎవరికి?

ఇంగ్లాండ్ గడ్డపై టీమ్‌ఇండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ హెడింగ్లీ వేదికగా ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించగా.. సెకండ్ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్‌ సమం చేసింది. ఈ నేపథ్యంలో సిరీస్‌ విజయం కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. టీ-20 సిరీస్‌ను  2-1 తేడాతో గెలిచిన కోహ్లి సేన.. వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు సొంత గడ్డపై వన్డే సిరీస్ గెలిచి టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ఫాంలో ఉన్న ఇంగ్లండ్‌కు సొంత గడ్డపై టీమ్‌ఇండియా సవాల్ విసిరింది. అంచనాలకు తగ్గట్టుగా తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. అయితే టీమ్‌ఇండియా టాపార్డర్‌ అద్భుతంగా ఉన్నా.. మిడిలార్డర్ వైఫల్యం మాత్రం జట్టును వేధిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్‌తో పాటు కెప్టెన్ కోహ్లి మంచి ఫాంలో ఉన్నారు. అయితే రెండో వన్డేలో టాపార్డర్ విఫలమైతే… మిడిలార్డర్ కూడా చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా స్థానంలో దినేష్ కార్తీక్‌ను బరిలోకి దించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇక రిస్ట్ స్పిన్నర్లతో భారత బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. కుల్దీప్, చాహల్‌ మరోసారి ఈ వన్డేలో మ్యాజిక్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇక గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమేష్ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌తో పేస్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది.

మరోవైపు రెండో వన్డే విజయంతో ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్‌ కుల్దీప్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు.  ఇదే జోరులో మరో మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ విజయంతో టి20 లెక్క సరి చేయాలని కెప్టెన్‌ మోర్గాన్‌ భావిస్తున్నాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ గాయపడటంతో అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్ ను బరిలోకి దిగే  అవకాశముంది. హెడింగ్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారనుంది.