తొలి త్రైమాసికంలో సింగరేణి పురోభివృద్ధి

సింగరేణి కాలరీస్ కంపెనీ ఉత్పత్తిలో పురోగమిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో బొగ్గు రవాణా, ఓవర్ బర్డన్ తొలగింపు, బొగ్గు ఉత్పత్తిలో గత యేడాది ఇదే కాలానికి సాధించిన దానిపై మంచి వృద్ధి రేటును నమోదు చేసింది.

గత యేడాది మొదటి త్రైమాసికంలో 155.7 లక్షల టన్నుల బొగ్గు రవాణ జరిపిన సింగరేణి, ఈ యేడాది అదే కాలానికి 168.76 లక్షల టన్నుల బొగ్గు రవాణ జరిపి 8.4 శాతం వృద్ధిని సాధించింది.

అలాగే గత త్రైమాసికంలో 891 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ తొలగించిన సింగరేణి, ఈ యేడాది అదే కాలానికి రికార్డు స్థాయిలో 1043 లక్షల క్యూబిక్ మీటర్లను తొలగించి 19 శాతం వృద్ధిని నమోదు చేసింది.

గత యేడాది మొదటి మూడు నెలల్లో143.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన  సంస్థ.. ఈ యేడాది అదే కాలనీకి 145.63.లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 1.5 శాతం మెరుగుదలను సాధించింది.

గత యేడాది జూన్ నెలతో పోలిస్తే ఈ యేడాది జూన్ నెలలో సింగరేణి మంచి ప్రగతిని నమోదు చేసింది. గత జూన్ నెలలో 245 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ తొలగించిన కంపెనీ, ఈ జూన్ లో 25 శాతం వృద్ధితో 307 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీసింది.

గత జూన్ లో 49.59 లక్షల టన్నుల బొగ్గు రవాణ చేసిన సింగరేణి సంస్థ, ఈ జూన్ లో 6 శాతం వృద్ధితో 52.7 లక్షల టన్నుల బొగ్గును రవాణ చేసింది.

గత జూన్ లో 48 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి, ఈ జూన్ లో 3.2 శాతం వృద్ధితో 49.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.

ఇకనుంచి వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. అందువల్ల గనుల వారిగా ప్రత్యామ్నాయ ప్రణాళికలతో పని చేస్తూ నెల వారి లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్మికులను కోరారు.