కేంద్రం, యూపీ సర్కార్ల తీరుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌ మహల్ పరిరక్షణపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజ్‌ మహల్‌ ను సంరక్షించటంలో కేంద్ర ప్రభుత్వం  సహా ఉత్తరప్రదేశ్ సర్కార్‌ అలసత్వం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా దీనిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలని, లేదంటే కూల్చేయాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు పాటించకపోతే తాజ్‌ మహల్‌ కు తాళం వేస్తామని హెచ్చరించింది.

ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్‌ కన్నా తాజ్‌  అద్భుత కట్టడమని… అలాంటి అపురూప నిర్మాణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. తాజ్‌ మహల్ ద్వారా విదేశీ పర్యాటకులతో పాటు విదేశీ కరెన్సీ లోటును కూడా పూడ్చుకోవచ్చని సూచించింది. ఈ కట్టడాన్ని పరిరక్షిచటంలో ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.

ఐతే, కాన్పూర్‌ ఐఐటీ విద్యార్థులు ప్రస్తుతం తాజ్ మహల్ చుట్టూ వాయు కాలుష్య స్థాయిలను అంచనా వేస్తున్నారని, నాలుగు నెలల్లో ఈ నివేదికను సమర్పిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా ఈ నెల 31 నుంచి ఈ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.