ముస్లింల సమగ్రాభివృద్ధికి చర్యలు

నిజామాబాద్ జిల్లాలో వక్ఫ్ భూముల డేటా బేస్ తయారు చేసేందుకు రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిప్యూటీ సీఎం మహమూద్ అలీని కోరారు. స్థానిక ముస్లింలు చాలాకాలంగా సర్వే చేయాలని కోరుతున్నారని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్ లో మైనారిటీ సంక్షేమంపై సమీక్షలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ఎంపీ కవిత పాల్గొన్నారు.

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బట్టలు అందజేసిందని ఎంపీ కవిత చెప్పారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,500 మందికి దుస్తులు పంపిణీ చేశారని తెలిపారు. అలాగే 29 మజీద్ లలో రు.29 లక్షలు ఖర్చుతో ఇఫ్తార్ విందు ఇచ్చారని వివరించారు.

నిజామాబాద్ లో యునాని ఆసుపత్రి మంజూరు చేయాలని, హజ్ హౌజ్ నిర్మించాలని ఎంపీ కవిత డిప్యూటీ సీఎం మహమూద్ అలీని కోరారు. అవసరమైన భూమి ఉందని తెలిపారు. ముస్లింలు నివసిస్తున్న ప్రాంతంలో మెటర్నిటీ ఆసుపత్రిని నిర్మించాలని ముస్లిం లు కోరుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చూడాలని ఎంపీ కవిత కోరారు.

హైదరాబాద్ తరవాత ముస్లిం జనాభా నిజామాబాద్ లోనే ఎక్కువగా ఉంటుందని కవిత చెప్పారు. మైనార్టీల నివాసిత ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్య, వైద్యం, ఉపాధి పట్ల ప్రత్యేక శ్రద్ద పెడుతున్నట్లు ఆమె వివరించారు. ముస్లింల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చూపవద్దని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులకు ఎంపీ కవిత ఉద్బోధించారు.

షాదీ ముబారక్ ఆర్థిక సాయం అందజేయడం ఆలస్యం జరుగుతోందని లబ్దిదారులు తన దృష్టికి తీసుకు వచ్చారని కవిత తెలిపారు. పెళ్లికి ముందే డబ్బు అందజేయాలన్నారు. రుణాలు అందజేయడంలో ఆలస్యం చేయవద్దని కోరారు. పెండింగ్ లో ఉన్న ఇమామ్ ల గౌరవ వేతనాన్ని రంజాన్ పండగ లోపే అందేలా చూడాలని, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎన్ రోల్ మెంట్ పెంచాలని, తరగతి గదులు సరిపోక పోతే డైట్ కాలేజీలలోని గదులను వినియోగించుకోవాలని ఎంపి కల్వకుంట్ల కవిత సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధికారులకు శాఖాపరమైన సూచనలు చేశారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, మేయర్ ఆకుల సుజాత, కలెక్టర్ రామ్మోహన్ రావు, జేసీ రవీందర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సంజీవ్ పాల్గొన్నారు.