గేల్.. అత్యుత్తమ బ్యాట్స్‌మన్

ఐపీఎల్-11లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా చెలరేగిన ఆల్‌రౌండర్ వాట్సన్(106; 57 బంతుల్లో 9×4, 6×6) శతకంతో రాణించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 106వ మ్యాచ్‌లో 106 పరుగులతో అలరించడం తన కెరీర్‌లో గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది. చాలా ప్రశాంతంగా ఎలాంటి హడావుడి లేకుండా అలవోకగా బౌండరీలు బాది అభిమానులను అలరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వాట్సన్ విండీస్ స్టార్ క్రిస్‌గేల్ ప్రదర్శనను కొనియాడాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్. చాలా టీ20 శతకాలు సునాయాసంగా సాధించాడు. ఆ అసాధారణ ప్రదర్శన కారణంగానే అతడు యూనివర్స్ బాస్ అయ్యాడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఎదురుదాడికి దిగి మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడన్నాడు.  గురువారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 11 సిక్సర్లు బాదిన గేల్ శతకాన్ని 58 బంతుల్లో పూర్తి చేశాడు. వాట్సన్ మాత్రం కేవలం 6 సిక్సర్లే కొట్టి 51 బంతుల్లో సెంచరీ పూర్తిచేయడం విశేషం. వాట్సన్‌కు ఐపీఎల్‌లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. గేల్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 6 సెంచరీలు నమోదు చేశాడు.