నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ఇవాళ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 48వ వార్షిక సదస్సు ప్రారంభం కానున్నది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి..  వివిధ వర్గాల ప్రతినిధులు 3000 మందికి పైగా పాల్గొననున్నారు. సదస్సులో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి సాధనలో పర్యావరణం, ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాల్లో తలెత్తే సమస్యలు, సంపన్న దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక విభేదాలపైనా చర్చిస్తారు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని 130 మంది భారత ప్రతినిధి బృందం ఇప్పటికే  దావోస్‌కు చేరుకున్నది. సదస్సులో ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న, ఎదురు కానున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలపై సీరియస్‌గానే దృష్టి సారిస్తామని ప్రధాని మోడీ తెలిపారు.

డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాజ్ స్కాబ్ స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమవుతుంది. క్లాజ్‌ స్కాబ్‌ తన సందేశంలో సదస్సు ఉద్దేశాన్ని తెలియజేస్తారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ ఖాన్, ఆస్ట్రేలియా సినీ నటి కేట్ బ్లాంచెట్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎల్టన్ జాన్‌లకు ఆయా రంగాల్లో విశేష సేవలందించినందుకు క్రిస్టల్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇవాళ సాయంత్రం సంగీత నృత్యరూపకం ఉంటుంది.

మరోవైపు, సదస్సుకు హాజరైన అతిథులకు భారత్ ఆతిథ్యమివ్వనున్నది. రేపు (మంగళవారం) జరిగే ప్లీనరీ సదస్సులో ప్రధాని మోడీ తన ప్రారంభోపన్యాసంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి భారత్ చోదక శక్తిగా ఉంటుందని పేర్కొంటూ విదేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 21వ శతాబ్దిలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు సూచిస్తారు.

డబ్ల్యూఈఎఫ్ సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలు లేవు. పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ కూడా  హాజరైనా ఆయనతో మోడీ భేటీకి ప్రణాళికేమీ ఖరారు కాలేదని భారత్ అధికారులు స్పష్టం చేశారు. ట్రంప్ రూపొందించిన అమెరికన్ ఫస్ట్ పాలసీపై జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లతోపాటు ప్రపంచ దేశాల అధినేతలు ఎలా స్పందిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

స్వీయాభివృద్ధితో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక పురోగతికి భారత్ చోదక శక్తిగా  నిలుస్తుందన్న ప్రధాని మోడీ సందేశమే సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. 1997లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తర్వాత  డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు మోడీ హాజరవుతున్నారు. ప్రపంచంలోని 60 కార్పొరేట్ సంస్థల  సీఈవోలకు ప్రధాని మోడీ విందు ఇస్తారు. 120 మంది వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. ప్రధాని మోడీ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంజే అక్బర్, జితేంద్ర సింగ్, కార్పొరేట్ సంస్థల అధినేతలు ముఖేశ్ అంబానీ, గౌతం అదానీ, అజీం ప్రేమ్‌జీ, రాహుల్ బజాజ్, చంద్రశేఖరన్, వివిధ సంస్థల సీఈవోలు చందాకొచ్చర్, ఉదయ్ కొటక్, అజయ్ సింగ్ ఉన్నారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్, తదితర దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చిస్తారు.

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే స్విట్టర్లాండ్‌లోని దావోస్ నగరానికి చేరుకున్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ను ఈ సదస్సుకు ప్రత్యేకంగా  ఆహ్వానించారు. ప్రపంచంలో అగ్రశేణి పారిశ్రామికవేత్తలు పాల్గొనే సదస్సులో, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న  అవకాశాలను, ఇక్కడి వనరులను మంత్రి కేటీఆర్ వివరిస్తారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతోనూ ఆయన భేటీ కానున్నారు.