ఆసీస్ సహాయక కోచ్‌గా పాంటింగ్

ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు సహాయక కోచ్‌గా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో మొదలయ్యే ముక్కోణపు టీ20 సిరీస్ కోసం చీఫ్ కోచ్ లీమన్, ట్రాయ్ కూలె, మాథ్యూ మాట్‌తో కలిసి పాంటింగ్ పనిచేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పాంటింగ్ ఆసీస్ కోచ్‌గా వ్యవహరించాడు. టీ-20 ఫార్మాట్‌లో ఈ మాజీ కెప్టెన్‌కు ఉన్న అపార అనుభవాన్ని సీఏ వాడుకోవాలని చూస్తున్నది. దీనికి తోడు ప్రధాన కోచ్ లీమన్ కాంట్రాక్టు గడువు 2019 ఆఖరు వరకు ముగియనుంది. ఈ నేపథ్యంలో లీమన్‌కు వారసునిగా పాంటింగ్‌ను కొనసాగించేందుకు సీఏ ఆసక్తి కనబరుస్తున్నది. ఐపీఎల్‌లో గతంలో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన పాంటింగ్.. వచ్చే సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు శిక్షణ ఇవ్వనున్నాడు.