అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధికి కృషి

సీఎం కేసీఆర్ వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కాళేశ్వరం నీటితో వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. సువిశాల స్థలంలో వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ భవన సముదాయానికి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారని కడియం శ్రీహరి చెప్పారు. ఉద్యమకాలంలో తనకు అండగా నిలిచిన ఓరుగల్లు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.

తెలంగాణలో ప్రజల అవసరాలు తీర్చేలా పాలన కొనసాగుతోందని స్పీకర్ మధుసూదనాచారి ప్రశంసించారు. ఒకేసారి 21 జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఏడాదిలోగా అత్యాధునిక హుంగులతో కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు దగ్గరైందన్నారు ఎంపీ వినోద్ కుమార్.

ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, సతీశ్ కుమార్, చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్ పద్మ, మేయర్ నరేందర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.