రేపట్నుంచి లంకతో వన్డే సిరీస్

సొంతగడ్డపై ఎదురులేని టీమిండియా.. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు రెడీ అవుతోంది. ధర్మశాల వేదికగా రేపు ఉదయం పదకొండున్నరకు ప్రారంభం కానున్న తొలి వన్డేకు అంతా సిద్ధం అయింది. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ.. సిరీస్ విక్టరే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అంతా కొత్త జట్టుతో ప్రయోగాలు చేయనుంది. అటు సంధి దశలో ఉన్న లంక ఆల్ రౌండర్ తిషారా పెరీరా కెప్టెన్సీలో సంచలనాలు సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తోంది.

టెస్ట్ సిరీస్ లో అలరించిన టీమిండియా.. వన్డే సిరీస్ లోనూ జోరు కొనసాగించాలని చూస్తోంది. యంగ్ ప్లేయర్లతో టీమ్ అంతా కొత్త ఉత్సాహంతో ఉంది. టాపార్డర్ లో కోహ్లీ లేని లోటును పూడ్చేందుకు యంగ్ ప్లేయర్లు శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే లతో పాటు దినేశ్ కార్తీక్ రెడీ అవుతున్నారు. ఇక మిడిలార్డర్ లో సీనియర్ మహేంద్ర సింగ్ ధోనీ కీలకం కానున్నాడు. ఆల్ రౌండర్ పాండ్యా జట్టుకు అదనపు బలం. ఎన్నో అవకాశాలు వచ్చినా సరిగ్గా కుదురుకోలేకపోతున్న జాదవ్ కు ఈ సిరీస్ లో రాణించడం తప్పనిసరిగా మారింది. బౌలింగ్ లో బూమ్రా, భువీలను ఎదురుకోవడం లంకకు పెనుసవాలే. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ లు తొలి వన్డేలో సత్తా చాటితే టీమిండియాకు శుభారంభం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

గతమెంతో ఘనమన్నట్లుగా మారింది లంక పరిస్థితి. అనుభవలేమితో లంక నానా తంటాలు పడుతోంది. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తిషారా పెరీరాకు కఠిన సవాలే ఎదురుకానుంది. జట్టులో తిరమనే, మథ్యూస్, తరంగా లాంటి సీనియర్ ప్లేయర్లపైనా లంక విజయావకాశాలు ఆధారపడనున్నాయి, చివరి టెస్టులో సెంచరీ చేసిన ధనంజయ్ డిసిల్వాకు తుదిజట్టులో స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కీపర్ డిక్వెల్లా తో పాటు కెప్టెన్ పెరీరా లు రాణిస్తే లంక టీమిండియాకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

ధర్మశాలలో టీమిండియాకు మంచి రికార్డే ఉంది. ఈ వేదికపై టీమిండియా ఇప్పటి వరకు మూడు వన్డేలు ఆడితే రెండింట్లో విజయం సాధించింది. చివరి మ్యాచ్ లో కివీస్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానుంది.