అలనాటి బాలీవుడ్ హీరో శశికపూర్ కన్నుమూత

అలనాటి మేటి బాలీవుడ్ హీరో శశికపూర్ (79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ముంబైలో తుదిశ్వాస విడిచారు. పాత తరం బాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ కపూర్ మూడో కొడుకు శశికపూర్. 1938 మార్చి 18న కోల్ కతాలో జన్మించిన శశికపూర్, 1941 నుంచి 1999 వరకు బాలీవుడ్ లో తన నట ప్రస్థానం కొనసాగించారు. బాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందారు. మొత్తం 116 సినిమాల్లో నటించిన శశి, 61 సినిమాల్లో హీరోగా మెప్పించారు. ఆయన చివరి సినిమా సైడ్ స్ట్రీట్స్ (1999).

ఆగ్, ఆవారా సినిమాలతో బాలీవుడ్ లో ప్రవేశించిన ఆయన, ధర్మపుత్ర సినిమాతో హీరోగా మారారు. అమితా బచ్చన్ తో కలిసి దీవార్, నమక్ హలాల్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన దీవార్, కభీకభీ, సిల్‌సిలా, అవారా, సత్యం శివం సుందరం, నమక్ హలాల్, కాలాపత్తర్, రోటి కప్‌డా ఔర్ మకాన్ లాంటి సినిమాలు విశేష ఆదరణ పొందాయి. నటుడిగానే కాక.. దర్శకుడిగా, నిర్మాతగా సినీ రంగానికి సేవలందించారు. 2011లో పద్మభూషణ్, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే, 2010లో నేషనల్ ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ తో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు.

శశికపూర్ మృతి పట్ల బాలీవుడ్ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు నిమిషాల సేపు మౌనం పాటించారు.