ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం

ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ సభల సందర్భంగా తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్ట సంప్రదాయ జానపద కళారూపాలు, గజ్జెల మోతలతో రాజధాని హైదరాబాద్ నగరం దద్దరిల్లేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఏర్పాట్లు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీలతో పాటు  జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆహ్వానించాల్సిన ప్రముఖుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎక్కువ శాతం తెలుగు మాట్లాడే ప్రజలు జీవిస్తున్న మారిషస్, సింగపూర్, లండన్, అమెరికా, కెనడాలకు చెందిన అధికారులను కూడా ఈ సభలకు ఆహ్వానించనున్నారు. దేశంలోని బరంపురం, సూరత్, ముంబై, చెన్నై, బెంగళూరు, మైసూర్ వంటి మహానగరాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లో 8 నుంచి 10 వేదికలపై సాహితీ, కళారంగాలకు చెందిన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి, శిల్పకళావేదిక, తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం, హరిహరకళాభవన్, భారతీయ విద్యాభవన్ వంటి వేదికలన్నింటిపైనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి వేదికకు ప్రత్యేకంగా కమిటీలను, ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథిలతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన కళారూపాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలల సాహిత్యంపై చర్చ, బాలసాహిత్యంలో విశేషంగా కృషి చేసిన పెద్దలను భాగస్వాములను చేసే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ అవార్డులను అందుకున్న సాహితీ ప్రముఖులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. తెలంగాణలో రెండువేల ఏండ్ల సాహిత్య నేపథ్యం ప్రధాన కేంద్రంగా ఈ మహాసభలు జరుగనున్నాయి. మల్లినాథ సూరి, పాల్కురికి సోమన, బమ్మెర పోతనతోపాటు, తెలంగాణ నేలమీద లభించిన శాసనాలు, శాసనసాహిత్యం వంటి అనేక అంశాలు చర్చనీయాంశాలు కానున్నాయి.

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలోని కోర్ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమవుతూ నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, కవి రచయిత దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కార్యక్రమాలన్నింటికీ రాష్ట్ర సాహిత్య అకాడమీ కేంద్ర బిందువుగా ఉంటుంది. తెలుగు అకాడమీ సారథ్యంలో ఇప్పటికే 50 మంది తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాల పుస్తకాలు సిద్ధమయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక రూపుదిద్దుకుంటున్నది. జీవిత విశేషాల పుస్తకాలు, ప్రత్యేక సంచిక రూపకల్పనకు సాహితీ ప్రముఖులతో కమిటీలను ఏర్పాటుచేశారు.