సాహోలో శ్రద్ధ డబుల్ రోల్!

బాహుబలి ది కంక్లూజన్ తరువాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న శ్రద్ధాకపూర్ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనుందని తెలిసింది. రెండు పాత్రల్లో ఒకటి ప్రతినాయిక ఛాయాలతో సాగుతుందని ఈ పాత్ర కోసం ఆమె యాక్షన్ సీన్లలోనూ పాల్గొననుందని, మరొకటి అమాయకురాలైన పాత్ర అని చిత్ర వర్గాల సమాచారం. వీలైనంత వేగంగా చిత్రాన్ని పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.