మిషన్ కాకతీయతో భూగర్భ జల సంపద పెరిగింది

ప్రతిష్ఠాత్మక మిషన్ కాకతీయ కార్యక్రమంతో రాష్ట్రంలో భూగర్భ జల సంపద వృద్ధిచెందిందన్నారు  మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సచివాలయంలో మిషన్ కాకతీయపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. సొంతరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెరిగిన భూగర్భ జలాలపై జిల్లాలు, మండలాలవారీగా భూగర్భజలవనరులశాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. భూమిపై పడిన ప్రతి నీటిబొట్టును భూమిలోకి ఇంకేలా ప్రణాళికలు రచించి, వాటి ద్వారా భూగర్భజలాలను సంరక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ నీటి వ్యవస్థ అభివృద్ధి పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలోని చండూరు, మర్రిగూడ మండలాల్లోని 22 గ్రామాలను ఎంపిక చేశామని, మిషన్ కాకతీయ వల్ల ఇక్కడ బోర్లలోనూ గణనీయంగా నీటిమట్టం పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు.

అటు రాష్ట్రంలో వివిధ కారణాలతో కనుమరుగైన 1880 చెరువుల జాడ కనుగొనాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆయా చెరువులను పునరుద్ధరించలేని పక్షంలో ఆ ప్రదేశాలు అటవీ లేదా ఇతర శాఖలకు కేటాయించాలని సూచించారు. ఉపగ్రహం ద్వారా జలవనరులను విశ్లేషించే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ పనితీరును జలసౌధలో మంత్రి పరిశీలించారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అధికారులు తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ పనితీరుపై సమగ్రంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని భారీ, మధ్య తరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న 8177 కాలువలు 22,700 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి.

ఆయా ప్రాజెక్టుల ప్రధాన కాల్వలతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు, సబ్ డిస్ట్రిబ్యూటరీలు, వాటి పరిధిలో సాగునీటి సరఫరా, ఆయా కాలువల పరిస్థితి, సామర్థ్యం తదితర అంశాలను కూడా శాటిలైట్ సాయంతో ఇరిగేషన్ అధికారులు నమోదుచేశారు. రాష్ట్రంలో ఇంతవరకు 43 వేల చెరువులను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ పూర్తి కావచ్చిందని అధికారులు మంత్రికి వివరించారు.