రియల్‌లైఫ్ కంటే రీల్‌లైఫ్‌లోనే బావున్నాం!

“సెట్‌లో అడుగుపెట్టినప్పుడు వ్యక్తిగతమైన విభేదాల్ని పూర్తిగా మరచిపోవాలి. కేవలం సినిమాపై దృష్టిపెట్టాలి. రణబీర్‌ కపూర్‌తో కలసి పనిచేస్తున్నప్పుడు మా ఇద్దరి గతం గురించి అస్సలు ఆలోచించలేదు. ఇప్పటికీ మేమిద్దరం మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నాం” అని చెప్పింది కత్రినా కైఫ్. బాలీవుడ్‌లో విఫలప్రేమికులుగా ముద్రపడ్డ రణబీర్‌ కపూర్, కత్రినా కైఫ్ జంట జగ్గా జాసూస్ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కత్రినాకైఫ్..రణబీర్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాల్ని పాత్రికేయులతో పంచుకుంది. తమ విఫల ప్రేమగురించి నేరుగా స్పందించడానికి నిరాకరించిన కత్రినాకైఫ్ అదొక చేదు జ్ఞాపకమని చెప్పింది. సినిమాలపరంగా రణబీర్‌కపూర్‌తో సత్సంబంధాలున్నాయని చెప్పింది. సెట్‌లో నేను, రణబీర్ ఎంతో సన్నిహితంగా వుంటాం. ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటాం. కొన్ని విషయాల్లో రణబీర్‌ను సరదాగా ఆటపట్టిస్తుంటాను. ఇదంతా సెట్స్ వరకే పరిమితం. బయట ఎవరి జీవితం వారిదే అంటూ కత్రినాకైఫ్ చెప్పుకొచ్చింది. రియల్‌లైఫ్ కంటే రీల్‌లైఫ్‌లోనే ఇద్దరం ప్రేమికులుగా బాగా రాణిస్తున్నామని చమత్కరించింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్ జంట వ్యక్తిగత విభేదాలతో ఇటీవలే విడిపోయారు.