ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడుదాం

రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నియంత్రించి ప్రాణాలను కాపాడుదామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి కోరారు. ప్రమాద రహిత తెలంగాణతో బ్రాండ్ ఇమేజ్ పెంచుదామన్నారు.  ప్రమాదాల నివారణకు విద్యాలయాల్లో అవగాహన పెంచుదామని చెప్పారు. రోడ్డు భద్రతపై హైదరాబాద్ లోని సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రవాణ, వైద్య, ఆర్ అండ్ బి, ఆబ్కారీ శాఖల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2016లో జరిగిన 22,815 ప్రమాదాలలో 7,227 మంది చనిపోగా.. 23,050 మంది గాయపడటం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు రవాణ భద్రతకు ఆబ్కారీ, ఆర్ అండ్ బి, రవాణ, పోలీస్ శాఖలతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రూ.37 కోట్లు పోలీస్ శాఖకు కేటాయించి పెట్రోలింగ్ వాహనాలు, స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్ల ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 ట్రామా కేంద్రాల ఏర్పాటుతో ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందిస్తామన్నారు. 2016 లో 6609 ప్రమాద కారక కేసుల్లో లైసెన్సులు రద్దు చేశామని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. 2016లో 20 లక్షల 71 వేల కేసులు నమోదు చేశామని, వీటి ద్వారా 29.74 కోట్ల జరిమానా, అలాగే 2017 లో 12 లక్షల కేసులతో 15.58 కోట్ల జరిమానాలు వసూలు చేశామన్నారు.