ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీస్ కు భారత్

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ సెమీస్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో  8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ధావన్, కోహ్లీ హాఫ్‌ సెంచరీలతో రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు.

రెండో మ్యాచ్‌లో అతి విశ్వాసానికి పోయి ఓటమి కొనితెచ్చుకున్న టీమిండియా తెలివిడి ప్రదర్శించింది. సెమీఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌  లో దుమ్మురేపింది. మొదట బౌలింగ్‌, ఆ తర్వాత బ్యాటింగ్‌ లో చెలరేగి సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ధావన్‌ 83 బంతుల్లో 78 రన్స్‌, కోహ్లీ 101 బంతుల్లో 76 రన్స్‌ చేశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీలకు ఓపెనర్లు ఆమ్లా, డీకాక్‌ చక్కని శుభారంభం ఇచ్చారు.  76 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి అశ్విన్‌ తెరదించాడు. డుప్లెసిస్‌ తో కలిసి డీకాక్‌ సౌతాఫ్రికా స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. 72 బంతుల్లో  53 రన్స్‌ చేసిన డీకాక్‌ ను జడేజా బౌల్డ్‌ చేసి పెవిలియన్‌ పంపాడు.

డీకాక్‌ అవుట్‌ తర్వాత సౌతాఫ్రికా తడబడింది. భారత ఫీల్డర్లు రెండు మెరుపు రనౌట్లతో సౌతాఫ్రికాను ఒత్తిడికి గురిచేశారు. డివిలియర్స్‌, డేవిడ్‌ మిల్లర్‌ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యారు. మరోవైపు కట్టుదిట్టంగా బంతులు వేసిన అశ్విన్‌, జడేజా, భువీ, బుమ్రా.. సౌతాఫ్రికాను దెబ్బతీశారు.  ఒకరి వెంట ఒకరిగా పెవిలియన్‌కు పంపించారు. 14 పరుగులకే  చివరి ఐదుగురు బ్యాట్స్‌ మెన్‌ అవుటయ్యారు.  దీంతో సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌటైంది. భువీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు కాన్ఫిడెంట్‌గా ఆరంభించారు. అయితే సూపర్‌ ఫామ్‌ లో ఉన్న రోహిత్‌ ఈసారి 12 రన్స్‌ కే అవుటై నిరాశపరిచాడు. రోహిత్‌ అవుటైనా ధావన్‌, కోహ్లీ.. భారత్‌ ఇన్నింగ్స్‌ ను ముందుకు నడిపారు. జాగ్రత్తగా ఆడుతూనే అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పరిగెత్తించారు. ఈ క్రమంలో ధావన్‌, కోహ్లీ చెరో హాఫ్‌ సెంచరీ సాధించారు.

ధావన్‌ 83 బంతుల్లో 78 పరుగులు చేసి అవుటైనా.. యువరాజ్‌ అండగా కోహ్లీ మిగతా లాంచనాన్ని పూర్తి చేశాడు. దీంతో భారత్‌ కు 38 వ ఓవర్లోనే విజయం దక్కింది. ఈ విజయంతో గ్రూప్‌— బి టాపర్‌గా సెమీఫైనల్లో ప్రవేశించింది. సెమీస్‌ లో బంగ్లాదేశ్‌ తో తలపడనుంది.