అవినీతి కొండ వెంకయ్య

ఏపీలో ఓ సబ్ రిజిస్ట్రార్ కూడబెట్టిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. విశాఖ జిల్లా గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్యనాయుడుకు చెందిన విశాఖ, తిరుపతిల్లోని 10చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. నెలకు రూ.36 వేలు జీతం వస్తున్న ఆయన కూడబెట్టిన అక్రమాస్తుల మార్కెట్‌ విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని తేల్చారు. ఆయన నివసించే ఫ్లాటులోని స్నానపు గదే ఓ చిన్న ఇంటిని తలపిస్తుంది. అందులో ఏర్పాటు చేసిన స్నానానికి వినియోగించే అత్యాధునిక యంత్రం ఖరీదు రూ.5 లక్షలు పైనే. వంటగది ఓ కిరాణా దుకాణాన్నే తలపిస్తుంది. ఆయన మెడలో ధరించే రుద్రాక్షమాల విలువ రూ.5 లక్షలు పైనే ఉంటుంది. ఖరీదైన కార్లు… విలాసవంతమైన గృహోపకరణాలు ఇలా లక్షల విలువైన సామాగ్రి బయటపడ్డాయి.

ఏసీబీ దాడులు చేసినా వారికి తన అక్రమాస్తుల గుట్టు చిక్కకుండా ఉండేందుకు వెంకయ్య అతి తెలివి ప్రదర్శించాడు. తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించాడు. తను కూడబెట్టిన అక్రమాస్తుల్లో ఎక్కువ భాగం ఆమె పేరిటే రిజిస్టర్‌ చేయించాడు. ఏసీబీకి చిక్కినా ఆ ఆస్తులతో తనకు సంబంధం లేదని, ఆమెతో ఎప్పుడో విడాకులు తీసుకున్నానని చెప్పేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. వాస్తవానికి విడాకులు కేవలం కాగితాలపైనే. ఇద్దరు భార్యలతో కలిసి ఆయన ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు.