అనూహ్య సంఘటనల దృశ్యరూపం

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కేరాఫ్ సూర్య. సుశీంద్రన్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఇటీవల హీరో సూర్య విడుదల చేశారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ “ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ మధ్య తరగతి యువకుడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు దృశ్యరూపంలా వుంటుందీ చిత్రం. ఓ లక్ష్యం కోసం అతను చేసిన పోరాటమేమిటన్నది ఆసక్తికరంగా సాగుతుంది. సందీప్‌కిషన్ పాత్ర చిత్రణ వినూత్న పంథాలో సాగుతుంది. ఆయన కెరీర్‌లో విభిన్న చిత్రమవుతుంది. కబాలి చిత్రానికి పనిచేసిన అంబు, అరియులు ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తమిళ సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.