బాలభవన్ లో వేసవి శిబిరం సందడి

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఎక్కడ లేని ఆనందం. స్కూల్‌, ట్యూషన్స్‌, హోంవర్క్‌ కి టాటా చెప్పి సమ్మర్‌ హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేస్తారు. అయితే కాస్త క్రియేటివిటీ జోడించి భిన్నంగా ఆట, పాటలతో వేసవి శిబిరం నిర్వహిస్తోంది హైదరాబాద్ లోని బాలభవన్. చిన్నారులకు కళలతోపాటు శాస్త్రీయమైన అంశాలపై అవగాహన కల్పించే సైన్స్ పాఠాలు, ఇతర కార్యక్రమాలను అందిస్తోంది.

బాల భవన్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరంలో సంగీతం, నాట్యం, చిత్రలేఖనంతో పాటు పలు అంశాల్లో చిన్నారులు రాణిస్తున్నారు. అల్లికలు, కుట్లు నేర్చుకుంటున్నారు. తబలా వాయిస్తున్నారు. సమ్మర్‌ సెలవులను వృధా చేయకుండా ఏదో ఒక అంశంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

భరత నాట్యం, కూచిపూడి, ఫోక్‌ డ్యాన్స్‌ పై చిన్నారులు మక్కువ చూపిస్తున్నారు. ఐదు సంవత్సరాల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు పలు అంశాలలో శిక్షణ ఇస్తున్నామని బాలభవన్‌ ప్రతినిధులు తెలిపారు. ఏడాదికి కేవలం 50 రూపాయల ఫీజు చెల్లించి శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చని చెప్పారు. అలాగే కోర్సుని విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు అందజేస్తామని చెప్పారు.

సమ్మర్ క్యాంప్‌లకు భిన్నంగా బాలభవన్ ఆటపాటలతో వేసవి శిబిరం నిర్వహిస్తోంది. కేవలం వేసవికే కాదు ఆ తర్వాత ఆదివారాలు, ఇతర సెలువుల్లోనూ ఈ తరగతులు కొనసాగుతాయి.