ఠాగూర్ లవ్ స్టోరీపై ప్రియాంక కన్ను!

అసమాన అభినయంతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ప్రతిభను చాటుతున్నది ప్రియాంకచోప్రా. నటిగా రాణిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాణంపై దృష్టిసారించిన ఈ ముద్దుగుమ్మ మరాఠీ చిత్రం వెంటిలేటర్‌తో నిర్మాతగా తొలి అడుగులోనే జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నది. తాజాగా ఈ సొగసరి నోబెల్ గ్రహీత, ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ విఫల ప్రేమాయణం ఆధారంగా ఓ పీరియాడికల్ డ్రామాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. యవ్వనపు రోజుల్లో ముంబైలో తనకు ఇంగ్లీష్ భోదించే ఓ యువతితో ప్రేమలో పడ్డారు రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లిపోవడంతో ఆ ప్రేమకథకు ముగింపు పడింది. ఠాగూర్ విషాదాంత ప్రేమకథతో బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రియాంకచోప్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి జాతీయ అవార్డు గ్రహీత ఉజ్వల్ ఛటర్జీ దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.