కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు!

హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నారు. ఫోల్డింగ్ బైక్‌, ఆల్టర్‌ అండ్ వైకిల్‌, వాటర్‌ కార్, బ్యాటరీ సైకిల్‌, సోలార్ గగ్రాస్ కట్టర్‌, డీజిల్ బైక్‌ తయారు చేసి అబ్బురపరుస్తున్నారు.

సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న కిరణ్ కుమార్, పవన్ కుమార్, భరత్ సింహారెడ్డి, సిద్ధార్థ్‌, మురళి అందరూ కలిసి వినూత్నంగా ఆలోచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి…సరికొత్త ఆవిష్కరణలకు తెరతీశారు. డీజిల్‌ బైక్‌, వాటర్ కార్ తయారీకి రూపకల్పన చేశారు. కాలేజ్‌ యజమాన్యం ప్రోత్సాహంతో.. కొన్ని నెలలు కష్టపడి ఫోల్డింగ్ బైక్‌,ఆల్టర్‌ అండ్ వైకిల్‌, వాటర్‌ కార్, బ్యాటరీ సైకిల్‌, సోలార్ గగ్రాస్ కట్టర్‌, డీజిల్ బైక్‌ తయారు చేశారు.

వీటిలో కొన్నింటికి తక్కువ ఖర్చుకాగా.. వాటర్ కార్‌కు మాత్రం హెచ్‌ఓడీ శ్రీకాంత్ ఆర్థికసాయం చేశారని విద్యార్థులు చెప్పారు. తమ ఆవిష్కరణలకు సహకరించిన కాలేజ్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రతిభను కార్పోరేట్ కంపెనీలకు తెలియచెప్పాలని విద్యార్థులు ఉత్సాహపడుతున్నారు. నూతన టెక్నాలజీతో ఇంకా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తామంటున్నారు.

సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న విద్యార్థులను కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్పీ వేణుమాధవరావు ప్రశంసించారు. విద్యార్థులకు సహాయ సహకారాలందించిన హెచ్‌ఓడీలను ఆయన అభినందించారు. జూనియర్ విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.