4జీ క‌స్ట‌మ‌ర్ల‌కు ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

4జీ స‌ర్వీస్‌లో రిల‌యెన్స్ జియో నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్ కొత్త‌గా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. వేరే నెట్‌వ‌ర్క్ నుంచి ఎయిర్‌టెల్‌కు మారే క‌స్ట‌మ‌ర్ల‌కు ఏడాదిపాటు రూ.9 వేల విలువైన 4జీ డేటాను ఫ్రీగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. జియోకు పోటీగా త‌మ 4జీ క‌స్ట‌మ‌ర్ల‌ను పెంచుకోవడంలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌లో లేకుండా, 4జీ హ్యాండ్‌సెట్ ఉన్న ప్ర‌తి కస్ట‌మ‌ర్‌కు ఈ 12 నెల‌ల ఫ్రీ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఎయిర్‌టెల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  ఈ ఆఫ‌ర్ జ‌న‌వ‌రి 4 నుంచి ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌ని చెప్పింది. ఈ ఆఫ‌ర్ కింద కొత్త‌గా ఎయిర్‌టెల్‌లోకి మారే వారికి నెల‌కు 3 జీబీ చొప్పున డిసెంబ‌ర్ 31, 2017 వ‌ర‌కు ఉచిత డేటా ల‌భిస్తుంది. సాధార‌ణంగా ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్‌ల‌తోపాటు వ‌చ్చే ప్యాకేజీల‌కు ఇది అద‌నం. ప్రీపెయిడ్‌లో రూ.345 రీచార్జ్ చేసుకొనేవారికి సాధారణంగా వచ్చే 1 జీబీ డేటాకు అద‌నంగా నెల‌కు మ‌రో 3 జీబీ డేటా ల‌భించ‌నుంది. ప్ర‌తి నెలా ఈ ఫ్రీ డేటా 28 రోజుల పాటు ఉంటుంది. అయితే డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు గ‌రిష్ఠంగా 13 రీచార్జ్‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. తొలిసారి ఇచ్చే ఫ్రీ 3 జీబీ డేటాను మై ఎయిర్‌టెల్ యాప్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాతి నుంచి ప్ర‌తి రీచార్జ్‌కు వెంట‌నే ఫ్రీ డేటా వ‌చ్చేస్తుంది.