కటక్ వన్డేలో భారత్ విజయం

పూణే వన్డే రిపీటయింది. అపుడు ఛేజింగ్‌లో అదుర్స్‌ అనిపించిన కోహ్లీ సేన.. కటక్‌ లో బిగ్‌ టార్గెట్‌ ఉంచి సక్సెస్‌ అయింది. బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. మొదట యువీ, మహీల సూపర్‌ బ్యాటింగ్‌ తో ఇంగ్లాండ్‌ ముందు 382 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా.. ఆ తర్వాత ప్రత్యర్థిని 366 పరుగులకు పరిమితం చేసింది. మూడు వన్డేల సిరీస్‌ ను కోహ్లీ సేన 2-0తో కైవసం చేసుకుంది.

యువీ-మహీ జోడీ కళ్లు చెదిరే షాట్లతో కటక్‌లో విధ్వంసం సృష్టించారు. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.  25 పరుగులకే ఓపెనర్లు రాహుల్‌, ధావన్‌తో పాటు కెప్టెన్‌ కోహ్లీ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను యువరాజ్‌, ధోనీ ముందుకు నడిపించారు. ఈ వింటేజ్‌ మిత్రుల అపురూపమైన బ్యాటింగ్‌కు కటక్‌ వేదికైంది. చాన్నాళ్ల తర్వాత ఇద్దరూ పోటీపడి ఆడుతుంటే చూసి క్రికెట్‌ భారతావని మురిసిపోయింది. బౌండరీలు, సిక్సర్లల మోతతో బారాబతి టాప్‌ లేచిపోయింది.

యువీ-మహీ జోరు ముందు ఇంగ్లాండ్‌ బౌలర్లు బిక్కచచ్చిపోయారు. ఏ బౌలర్‌ ను వదలకుండా చితక్కొట్టారు. యువీ సంయమనాన్ని, దూకుడును మేళవించి ఆడుతూ చక్కని డ్రైవ్‌లతో బంతిని బౌండరీ దాటించాడు.  అందివచ్చిన బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. 98 బంతుల్లో శతకం సాధించాడు. 2011 తర్వాత యువీకి ఇదే తొలి సెంచరీ. బ్యాట్‌తో వందనం చేసే సమయంలో భావోద్వేగానికి గురైన యువీ ఆ తర్వాత మరింత చెలరేగాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లను కసిగా వేటాడాడు. శతకం తర్వాత 28 బంతుల్లోనే మరో 50 పరుగులు సాధించి వన్డే కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 150 నమోదు చేశాడు.

మరో ఎండ్‌ లో ధోనీ.. ఆరంభంలో యువీకి తోడ్పాటు అందించాడు. అయితే హాఫ్‌ సెంచరీ తర్వాత గేర్‌ మార్చాడు. సిక్సర్ల మోత మోగించాడు.  సెంచరీ తర్వాత ధోనీ మరింతగా విజృంభించాడు. ధోనీ-యువీ జోడీ నాలుగో వికెట్‌కు 256 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. యువరాజ్‌ 127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌ లతో 150 రన్స్‌, ధోనీ 122 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్స్ లతో 134 రన్స్‌ చేశారు.  కేదార్‌ జాదవ్‌ 22 రన్స్‌, హార్డిక్‌ పాండ్యా 19 రన్స్‌, జడేజా 16 రన్స్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 6 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారీ లక్ష్య చేధనలో ఇంగ్లాండ్‌ ఆరంభంలోనే తడబడింది. అయితే జేసన్‌ రాయ్‌, జో రూట్‌ రెండో వికెట్‌కు వంద పరుగుల జోడించి ఇన్నింగ్స్‌ ను పటిష్టపరిచారు. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 206 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ మోర్గాన్‌, మెయిన్‌ అలీ ధాటిగా ఆడుతూ ఇంగ్లాండ్‌ జట్టులో గెలుపు ఆశలు రేపారు. ముఖ్యంగా సిక్స్ లు, ఫోర్లతో చితక్కొట్టిన మోర్గాన్‌ 81 బంతుల్లో 102 రన్స్‌ చేసి చివర్లో రనౌట్‌ అవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో రాయ్‌ 82, రూట్‌ 54, మొయిన్‌ అలీ 55 పరుగులు చేశారు.భారత బౌలర్లు అశ్విన్‌ 3, బూమ్రా 2, జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌ చెరో వికెట్‌ తీశారు.

భారీ స్కోర్ల మ్యాచ్‌లో మరోసారి కోహ్లీ సేనదే పైచేయి అయింది. కటక్‌ వన్డేలో ఇంగ్లాండ్‌పై 15 పరుగులతో నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను  మరో వన్డే ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన కోహ్లీకి ఇదే తొలి వన్డే సిరీస్‌ విజయం.

అటు ఇంగ్లాండ్ పై సిరీస్‌ను సాధించిన భారత జట్టుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ సేన అద్భుతంగా ఆడిందన్న ముఖ్యమంత్రి..  ముందు ముందు ఇదే జోరును కొనసాగించాలని ఆకాంక్షించారు.