టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన అడుగు

టీఎస్‌ ఐపాస్‌ ఓ విప్లవాత్మక అడుగుగా రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి పారిశ్రామిక వేత్త దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే 2 వేల 929 పరిశ్రమలకు అనుమతులిచ్చామన్న కేటీఆర్.. వీటిద్వారా 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ.. ఇక ముందు కూడా అదే జోరు కొనసాగిస్తుందన్నారు. టీఎస్‌ ఐపాస్‌-ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌ పై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు.

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మంత్రి కేటీఆర్ మొదట సభ్యులకు వివరించారు. టీఎస్ ఐపాస్ లాంటి పారిశ్రామిక విధానం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. 200 కోట్లకు పైగా పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అనుమతులివ్వకుండా ఆలస్యం చేసే అధికారులకు రోజుకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు.

అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ టీఎస్ ఐపాస్‌ పై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామిక రంగం ఎంతో కీలకమైందని, కొత్త పరిశ్రమలను తీసుకురావడంతో పాటు.. ఉన్న పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగ్స్‌ లో తెలంగాణకు నంబర్‌ వన్‌ స్థానం రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

టీఎస్‌ ఐపాస్‌ తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దపెద్ద కంపెనీలు తరలివస్తున్నాయని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, కంపెనీలు తరలివెళ్లిపోతాయన్న వాళ్లకు టీఎస్‌ ఐపాస్‌ తో బుద్ధి చెప్పినట్టైందన్నారు.

అయితే, పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో స్పీకర్‌ కలగజేసుకుని.. తనకున్న విచక్షణ అధికారంతో సభలో ఉన్న ఏ సభ్యునికైనా మాట్లాడే అవకాశం ఇస్తానని తేల్చిచెప్పారు.

స్పీకర్‌ చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ వారి ఓవరాక్షన్‌ కు చెక్‌ పెట్టారు. రాజకీయ విలువలు, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. స్పీకర్‌ తనకున్న అధికారాలతో సభలో ఉన్న ఏ సభ్యునికైనా మాట్లాడే అవకాశం కల్పిస్తారని చెప్పారు. అజయ్‌  కుమార్‌  స్పీచ్‌ ను అడ్డుకునే హక్కు కాంగ్రెస్‌  నేతలకు లేదన్నారు. సభలో అందరికీ ఒక్కటే రూల్స్‌ వర్తిస్తాయన్నారు.

అనంతరం సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ఓపికగా సమాధానాలిచ్చారు.  టీఎస్‌ ఐపాస్‌ తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా తరలివస్తున్నాయన్నారు. ఇప్పటికే జహీరాబాద్‌ నిమ్జ్‌ కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. వరంగల్‌ శివార్లలో 2 వేల ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ ను ప్రారంభిస్తమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ లో చైనా తరహా ఫార్మాసిటీ  నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. జనగామ జిల్లాలో మెగా లెదర్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెదక్, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో సీడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెండున్నరేళ్లలో 34 వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు మంత్రి కేటీఆర్‌ సభలో సభ్యులకు వివరించారు.

పదేళ్లలో రాని పెట్టుబడులు రెండున్నరేళ్లలోనే టీఆర్ఎస్‌ ప్రభుత్వం సాధించిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు, బిల్ట్‌ పరిశ్రమ పునఃప్రారంభంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలోని నాయకులకు ఏ1, ఏ2 లంటూ క్రిమినల్‌ ర్యాంకులొస్తే.. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ వచ్చిందన్నారు.

పారిశ్రామిక అభివృద్ధిపై సభ్యులకు కావాల్సిన సమగ్ర సమాచారాన్ని అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగానే పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ.. ఇక ముందు కూడా అదే జోరు కొనసాగిస్తుందన్నారు.