అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వివిధ అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత టిఎస్ ఐపాస్-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపై స్వల్పకాలిక చర్చను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత వారి సందేహాలను మంత్రి కేటీఆర్ నివృత్తి చేశారు. అనంతరం సభను రేపు ఉదయం 10 గంటలకి వాయిదా వేస్తున్నట్టు ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు.

టిఎస్ ఐపాస్ పై చర్చకు ముందు నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు మంత్రి కేటీఆర్. ఖమ్మం పోలీస్ కమిషనరేట్, తెలంగాణ వ్యాట్ సవరణ బిల్లు-2016, భూ సేకరణ, జిహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లులను మంత్రి సభకు సమర్పించారు.

అటు శాసన మండలి కూడా రేపటికి వాయిదా పడింది. ఉదయం మండలి 10 గంటలకు మొదలు కాగానే మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ తదితర అంశాలపై చర్చ జరిగింది. తర్వాత శాసనమండలి రేపటికి వాయిదా పడింది.